రూ. 100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు
కస్టమర్లను ఆకర్షించేందుకు, మెరుగైన సేవలనూ అందించేందుకు స్కోడా ఆటో ఇండియా తన షోరూమ్‌లకు సరికొత్త హంగులను అద్దుతోంది. రూ.100 కోట్ల పెట్టుబడులతో దేశంలోని 40 ఎంపిక చేసిన డీలర్‌షిప్స్‌లకు ఆధునీకరిస్తున్నామని సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. శుక్రవారమిక్కడ మహావీర్ ఆటో ప్రై.లి. డీలర్ ప్రిన్సిపల్ ప్రస్వ కుమార్‌తో కలిసి 5,500 చ.అ. స్కోడా ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించారు.
‘‘షోరూంల ఆధునీకరణతో కస్టమర్లకు లగ్జరీ అప్పీరియన్స్‌తో పాటూ కొత్త మోడళ్ల ప్రదర్శన చేయటం సులువవుతుందని అశుతోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 షోరూమ్‌లుండగా.. వచ్చే ఏడాదికి వీటన్నింటికీ న్యూలుక్‌ను తీసుకొస్తామన్నారు. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సూపర్బ్, ఆక్టివా, యెటి, ర్యాపిడ్ నాలుగు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 2017 ముగింపు నాటికి మరో నాలుగు బ్రాండ్లను విడుదల చేస్తామని’’ వివరించారాయన. రూ.8.5 లక్షల నుంచి 30 లక్షల మధ్య ఉండే స్కోడా కార్ల అమ్మకాలు ఏటా 15 వేలుండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 20 వేలకు చేరుకుంటామని ధీమావ్యక్తం చేశారు.