చిన్న ఇన్వెస్టర్లకు ద్రవ్యోల్బణ బాండ్లు
న్యూఢిల్లీ: చిన్న, మధ్యతరహా ఇన్వెస్టర్ల కోసం ప్రభుత్వం ఈ నెల చివర్లో రిటైల్ ద్రవ్యోల్బణ(సీపీఐ) ఆధారిత సెక్యూరిటీల(బాండ్లు)ను ప్రవేశపెట్టనుంది. సీపీఐ ఆధారంగా వడ్డీ లభించే వీటిని ద్రవ్యోల్బణ సూచీ జాతీయ పొదుపు పత్రాలు(ఐఐఎన్‌ఎస్‌ఎస్)-క్యుములేటివ్‌గా వ్యవహరించనున్నారు. ప్రభుత్వం 2013-14కు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనమేరకు వీటిని విడుదల చేయనుంది. ప్రధానంగా చిన్న, మధ్య తరహా ఇన్వెస్టర్ల పొదుపు సొమ్ముకు ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి రక్షణ కల్పించే యోచనతో వీటిని రూపొందించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.
ఈ సెక్యూరిటీలను బ్యాంకుల ద్వారా విక్రయించనున్నట్లు తెలిపింది. వీటికి రెండు పద్ధతుల్లో వడ్డీ రేటును చెల్లించనున్నారు. స్థిర ప్రాతిపదికన 1.5% వార్షిక వడ్డీతోపాటు, ఆరు నెలలకు ఒకసారి సీపీఐ ఆధారంగా వడ్డీని చెల్లించనున్నారు. అయితే ఈ మొత్తాన్ని కాలపరిమితి ముగిసేసమయానికి అందిస్తారు. కాగా, ముందుగానే సొమ్మును వాపసు తీసుకునేందుకు సీనియర్ సిటిజన్లకు ఏడాది తరువాత అవకాశముంది. ఇతరులకు మూడేళ్ల తరువాత మాత్రమే ఇందుకు వీలుంటుంది. అయితే నియమిత కాలాల్లోనే ఇందుకు అనుమతించడంతోపాటు, పెనాల్టీ చార్జీలను విధిస్తారు.