స్మార్ట్‌ఫోన్ కంపెనీల వడ్డీలేని రుణాలు | Smartphone interest loans to companies | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్ కంపెనీల వడ్డీలేని రుణాలు

Published Thu, Sep 5 2013 1:14 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

స్మార్ట్‌ఫోన్ కంపెనీల వడ్డీలేని రుణాలు - Sakshi

స్మార్ట్‌ఫోన్ కంపెనీల వడ్డీలేని రుణాలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీ లేని రుణమంటే ఎగిరి గంతేస్తుంటారు చాలామంది. అదేదో ఫ్రీగా ఇచ్చేస్తున్నట్టే ఫీలవుతారు కొందరు. అలాంటివారి కోసం గృహోపకరణాలను అందించిన సంస్థలు... ఇపుడు స్మార్ట్ ఫోన్లకూ ఈ ఆఫర్ ఇస్తున్నాయి. వడ్డీ లేని ఈఎంఐలు... అంటూ మొబైల్ కంపెనీలు చేస్తున్న ప్రచారం వాటి అమ్మకాలను అమాంతం పెంచుతోంది. ఒకేసారి డబ్బు చెల్లించే స్తోమత ఉన్నవారు సైతం వాయిదా పద్ధతికే సై అంటూ హైఎండ్ ఫోన్లను ఎగరేసుకుపోతున్నారు. విశేషమేంటంటే ఇపుడీ ఆఫర్లు అందిస్తున్న వారి జాబితాలో యాపిల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలతో పాటు గొలుసుకట్టు రిటైల్ దుకాణాలూ చేరుతున్నాయి.
 
 స్మార్ట్ ఫోన్ల వరకూ వస్తే క్రెడిట్ కార్డు వినియోగదారులకు వడ్డీ లేని వాయిదా పద్ధతిని మొదట మొదలుపెట్టింది యాపిల్ కంపెనీయే. తర్వాత శామ్‌సంగ్, బ్లాక్‌బెర్రీ, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ కూడా ఈ దార్లో నడవటం ఆరంభించాయి. సంగీత, యూనివర్సెల్, టెక్నోవిజన్ వంటి ఔట్‌లెట్లతోపాటు ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల ద్వారా కంపెనీలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. బ్యాంకును బట్టి, ఔట్‌లెట్‌ను బట్టి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. అయితే లాట్, బిగ్ సి వంటి దుకాణాలు దాదాపు స్మార్ట్ ఫోన్లన్నిటిపైనా వడ్డీ లేని రుణ సదుపాయాన్ని అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డు లేని వారికి కొన్ని షరతులకులోబడి బజాజ్ ఫైనాన్స్ వడ్డీ రహిత రుణమిస్తోంది. బజాజ్‌తో తాము ఒప్పందం చేసుకున్నామని లాట్, బిగ్ సి ప్రతినిధులు చెప్పారు. వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులను తామే భరిస్తున్నామని వెల్లడించారు.
 
 చిన్న పట్టణాలకూ పాకిన ట్రెండ్..
 నెలవారీ వాయిదాల్లో స్మార్ట్‌ఫోన్లను తీసుకుంటున్న వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వేతన జీవులే అధికం. అయితే ఇపుడీ ట్రెండ్ చిన్న పట్టణాలకూ పాకుతోంది. ఖరీదైన ఫోన్లు కావాలంటే చాలా మంది గతంలో డబ్బులు జమ చేసుకుని కొనేవారు. ఇప్పుడా పరిస్థితి లేదని, 10 నిముషాల్లో నచ్చిన మోడల్‌ను సొంతం చేసుకోవచ్చని బిగ్-సి సంస్థ సీఎండీ బాలు చౌదరి చెప్పారు. మారుమూలనున్న ఔట్‌లెట్లలోనూ ఈ సౌకర్యం కల్పించామన్నారు. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో ఈఎంఐ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. తమ ఔట్‌లెట్లలో ఈఎంఐలపై కొంటున్నవారు 20 శాతం ఉంటున్నారని చెప్పారు.
 
 దూసుకెళ్తున్న అమ్మకాలు..
 రూ.6వేలు ఆపై ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లు దేశవ్యాప్తంగా జూలైలో దాదాపు 20 లక్షలు అమ్ముడయ్యాయి. రాష్ట్రంలో ఈ తరహా మొబైల్స్ నెలకు 1.65 లక్షల వరకూ ఉన్నాయి. రాష్ట్రం లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాల విలువ జూలైలో రూ.100 కోట్లు, ఆగస్టులో రూ.120 కోట్లుగా నమోదైంది. 2012 ఆగస్టులో ఇది రూ.50 కోట్లేనని, ఇందులో ఈఎంఐల వాటా 5 శాతం అనేది మార్కెట్ వర్గాల సమాచారం.
 
 గత నెల అమ్మకాల్లో ఈఎంఐల వాటా 33%. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు కొనేవారు పెరిగారని, దీనికి ఈఎంఐ పథకాలు దోహదపడ్డాయని టెక్నో విజన్ ఎండీ సికందర్ చెప్పారు. ‘ఈఎంఐలపై వడ్డీ భారం గతంలో కస్టమర్‌కు పడేది. ఇపుడు దాన్ని నేరుగా కంపెనీలే బ్యాంకులకు చెల్లిస్తున్నాయి. మా ఔట్‌లెట్లలో క్రెడిట్ కార్డు ద్వారా కొనేవారు గతేడాది 25%ఉండగా ఇపుడా సంఖ్య రెట్టింపయింది’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement