కానిస్టేబుల్ కొడుకు.. అంతర్జాతీయ నేరస్థుడు!
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
ముంబైలో ఓ సామాన్య పోలీసు కానిస్టేబుల్ కొడుకు.. కట్ చేస్తే, 1993 నాటి ముంబై పేలుళ్ల సూత్రధారి!! చీకటి సామ్రాజ్య అధినేత. ఎన్నెన్నో మాఫియా సినిమాలకు స్ఫూర్తిదాయకుడు. అతడు ఇంకెవరో కాదు.. దావూద్ ఇబ్రహీం కస్కర్. ఎంతోమంది మాఫియా డాన్లను తయారుచేసి వాళ్లందరి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయేలా చేసింది కూడా దావూద్ ఇబ్రహీమే. ఒకప్పుడు ముంబై మాఫియా అంటే మస్తాన్ హైదర్ మీర్జా, వరదరాజన్ మొదలియార్, అబ్దుల్ కరీం లాలా, బాషూ దాదా.. వీళ్లే ఉండేవాళ్లు. ఇలాంటి కరడుగట్టిన వాళ్ల మధ్య ఓ నిజాయితీ గల కానిస్టేబుల్.. ఇబ్రహీం కస్కర్. అతడి రెండో కుమారుడే దావూద్ ఇబ్రహీం కస్కర్. చదువు వంటబట్టక.. పెడదోవ పట్టాడు. చిన్న చిన్న గొడవలతో మొదలుపెట్టి, అప్పటికే ఉన్న డాన్ల మీద దాడులు చేసే స్థాయికి ఎదిగాడు. పోలీసులు కూడా.. నగరంలో డాన్లను అణిచేయడానికి మొదట్లో ఇతడి సాయం తీసుకున్నారు. కానీ దావూద్ వాళ్ల చేయి దాటిపోయి, తానే ఒక డాన్గా ఎదిగాడు. భారతదేశంలో ఉంటే ఇబ్బంది అవుతుందని దుబాయ్ పారిపోయాడు. అక్కడి నుంచే కొన్ని ఆపరేషన్లు చేసిన తర్వాత.. కరాచీకి తరలిపోయాడు. అప్పటినుంచి పాకిస్థాన్లోనే దాక్కున్న దావూద్ ఇబ్రహీం చిరునామా ఇన్నాళ్లకు మన నిఘా వర్గాలకు చేజిక్కింది. గతంలో ఓసారి తాను లొంగిపోతానంటూ ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీకి దావూద్ కబురు పంపగా, మనవాళ్లు అతడు పెట్టిన షరతులకు ససేమిరా ఒప్పుకొనేది లేదంటూ జారిపోనిచ్చారు. ఆ తర్వాత నకిలీనోట్ల చలామణి లాంటి వ్యాపారాలతో మరింత బలం పెంచుకున్న దావూద్.. ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఆధారాలన్నీ లభ్యం
ఇన్నాళ్ల బట్టి పాకిస్థాన్లో ఉంటూనే ముంబై నేర సామ్రాజ్యాన్ని శాశిస్తున్నాడు. బాలీవుడ్ సినిమాల్లో సగానికి పైగా అతడి డబ్బులతోనే రూపొందుతున్నాయన్న విషయం కూడా బహిరంగ రహస్యమే. అలాంటి దావూద్ ఇబ్రహీం.. అసలు తమ దేశంలోనే లేడని పాకిస్థాన్ కొన్నాళ్లు సన్నాయి నొక్కులు నొక్కింది. కానీ ఇప్పుడు అతడి భార్య పేరు మీద ఉన్న టెలిఫోన్ బిల్లు సహా.. మొత్తం మూడు చిరునామాలు భారత నిఘా వర్గాలకు చేజిక్కాయి.
దుబాయిలో దావూద్ సామ్రాజ్య విస్తరణ, తనకు అడ్డువచ్చిన వారినల్లా మట్టుపెట్టడం, బాలీవుడ్లో హంగామా, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన మారణహోమం, ఆపై జరిగిన బొంబే స్టాక్ ఎక్స్చేంజి పేలుళ్లు, దావూద్ కరాచీకి మకాం మార్చటం, ఛోటా షకీల్- దావూద్ మధ్య విద్వేషాలు, వాటి ఆధారంగా మన పోలీసులు పరోక్షంగా రాజన్కు సహకరించడం, 9/11 తర్వాత దావూద్ ఇబ్రహీంకు అల్ కాయిదాతో కూడా సంబంధాలున్నట్లు తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా 'మోస్ట్ వాంటెడ్'గా అతడిని గుర్తించడం లాంటి అనేక పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి.
ఇప్పుడేమంటారు..
ఇన్ని పరిణామాల తర్వాత ఎట్టకేలకు దావూద్ పూర్తి ఆచూకీని సాక్ష్యాధారాలతో సహా మన నిఘా వర్గాలు సంపాదించాయి. ప్రస్తుతం ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. దావూద్ ఇబ్రహీం ఫొటో కూడా ఇన్నాళ్లూ ఎప్పటిదో పాత ఫొటోనే ఉండేది. అలాంటిది ఇప్పుడు వార్ధక్యం మీద పడిన తర్వాత దావూద్ ఎలా ఉన్నాడో కూడా కొత్త ఫొటో దొరికింది. లాడెన్ కూడా ఎక్కడున్నాడో తమకు తెలియదని పాక్ చెప్పిన తర్వాతే అమెరికా నేవీ సీల్స్ స్వయంగా ఆ దేశంలో ప్రవేశించి లాడెన్ను మట్టుబెట్టిన విషయాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా మనవాళ్లు గుర్తుచేసుకోవాలి!!
- కామేశ్వరరావు పువ్వాడ