'ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తాం'
2014లో దేశంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో యూపీఏ సంకీర్ణ సర్కారు విజయఢంకా మోగించి, ప్రధానమంత్రి పీఠాన్ని ముచ్చటగా మూడోసారి కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధీమా వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో నేషనల్ మీడియా సెంటర్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓ వేళ దేశంలో ఎన్నికలు ముందుగా వచ్చిన తమ సంకీర్ణ సర్కార్ వంద శాతం విజయం సాధిస్తుందని సోనియా పేర్కొన్నారు.
ఈ శీతాకాల సమావేశాల్లో ఆహార భద్రత బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూపీఏ -2 ప్రభుత్వ హాయంలో నిత్యవసర ధరలు ఆకాశానంటాయి. అంతేకాదు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల జీవన పరిస్థితులు మరింత దర్భురంగా మారాయని ప్రతిపక్షాలు నిత్యం పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో యూపీఏ సంకీర్ణ సర్కార్ గెలుపొందడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూపీఏ సర్కార్-2 వచ్చే ఏడాది మే నెలతో ఐదేళ్ల కాలపరిమితి పూర్తి కానుంది.