
వెంకయ్యతో సోనియా ఆసక్తికర సంభాషణ
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు మధ్య ఆసక్తికరణ సంభాషణ చోటు చేసుకుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎదురుపడిన ఇరువురు అగ్రనేతలు తెలంగాణ బిల్లుపై మాట్లాడుకున్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని వెంకయ్య నాయుడిని సోనియా గాంధీ కోరారు. తాము ప్రతిపాదించిన సవరణలను ఆమోదిస్తే విభజన బిల్లు ఆమోదించేందుకు మద్దతు ఇస్తామని వెంకయ్య స్పష్టం చేశారు. ఆ సవరణలేంటో తమకు తెలపాలని సోనియా కోరారు. కాంగ్రెస్ తొలిసారిగా తెలంగాణ బిల్లు గురించి బీజేపీ నేతతో మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.
మరోవైపు తెలంగాణ బిల్లులో సవరణలపై చర్చిచేందుకు బీజేపీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలతో కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్ సమావేశమయ్యారు. రేపు తెలంగాణ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ వారంలోనే రాజ్యసభలోనూ విభజన ప్రవేశపెట్టాలని యూపీఏ సర్కారు పట్టుదలగా ఉన్నట్టు కనబడుతోంది.