సాక్షి, హైదరాబాద్: పోస్టాఫీసులు ఇక బ్యాంకులుగా మారుతున్నాయి. ఖాతాదారులు ఏ పోస్టాఫీసు నుంచైనా నగదు తీసుకునేందుకు వీలు కల్పించేలా తపాలా కార్యాలయాల్లో కోర్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించబోతున్నారు. పోస్టాఫీసుల్లో డబ్బు పొదుపు చేసేవారు అదే కార్యాలయంలో మాత్రమే లావాదేవీలు నిర్వహించే పరిస్థితి ఇప్పటిదాకా కొనసాగుతోంది. బ్యాంకులతో పోటీపడేందుకు త్వరలో ‘పోస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో పూర్తిస్థాయి బ్యాంకులుగా అవతారమెత్తబోతున్న పోస్టాఫీసులు ఈలోపే కోర్‌బ్యాంకింగ్‌తో ప్రజల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం తపాలా కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న పొదుపు బ్యాంకుల్లో కోర్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.
దీనివల్ల ఖాతాదారులు వారి ఖాతా ఉన్న పోస్టాఫీసుతో ప్రమేయం లేకుండా ఏ పోస్టాఫీసు నుంచైనా డబ్బు డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇందుకోసం సెంట్రలైజ్డ్ సర్వర్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు అన్ని పోస్టాఫీసులను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించటంతోపాటు అన్ని పోస్టాఫీసులు ఒకేరకంగా కనిపించేలా అన్నింటికీ ఒకేరకమైన రంగులు వేయటంతోపాటు లోపల కౌంటర్ల వ్యవస్థ కూడా ఒకేరకంగా ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల తపాలా కార్యాలయాలుంటే ఇందులో 13 వేలు గ్రామాల్లో శాఖా కార్యాలయాలుగా కొనసాగుతున్నాయి. రెండున్నర వేలవరకు సబ్ పోస్టాఫీసులున్నాయి. వీటిల్లో సొంతభవనాలున్న వాటిని ప్రస్తుతం ఆధునికీకరిస్తున్నారు. సత్వర సేవలందించటంలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. పనితీరును మెరుగుపరిచేందుకు సిబ్బందికి ప్రత్యేకంగా ‘కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్’ రూపొందించారు. ‘ప్రాజెక్టు యారో’ పేరుతో రాష్ట్రంలో తాజాగా 197 ప్రధాన పోస్టాఫీసుల ఆధునికీకరణను పూర్తిచేశారు.
పోస్టాఫీసుల్లో కోర్‌బ్యాంకింగ్
Published Sat, Aug 24 2013 2:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement