ముగిసిన గడువు
పాత రూ.500, రూ.1000 నోట్లకు తెర
చివరి రోజు పెద్దగా కనిపించని నగదు మార్పిడి
98 బ్యాంకులు, 139 పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి
ఏటీఎంల వద్ద కొనసాగిన క్యూలు
మంచిర్యాల అగ్రికల్చర్ : పాత రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి గడువు ముగిసింది. యాబై రోజులపాటు సాగిన ఈ నోట్ల మార్పిడి ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధనం బయటికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు మాత్రం ఇబ్బందు లు మాత్రం తప్పడం లేదు. జిల్లాలో నెలన్నరోజులపాటు దగ్గర ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ఎదుట బారులు తీరారు.
చివరి రోజు తక్కువే..
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ 98 బ్యాంకుల్లో, వారం రోజులపాటు 139 పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. చివరి – మిగతా 2లోu రోజైన శుక్రవారం నగదు మార్పిడికి పెద్దగా జనసందడి కనిపించలేదు. బ్యాంకుల్లో ఎక్కువగా విత్‌డ్రాకు మాత్రమే జనాలు వస్తున్నారు. పాత నోట్లను రద్దు చేసి 52 రోజులు గడిచినా ఇంకా నగదు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాంకుల అవసరం మేరకు డబ్బు చేరకపోవడం, ఏటీఎంల నుంచి సరిపడా చేతికందపోవడంతో ప్రజలు కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నోట్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా, ఏటీఎం వద్ద బారులదీరినా వారి చేతికందేది కొద్ది మొత్తంలోనే.. అందులో రూ.2 వేల నోట్లు ఇస్తుండటంతో దానికి చిల్లర దొరక్క చూసుకొని మురువాల్సి వస్తోంది. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి పనికి రాకుండాపోతున్నాయి.
వివిధ రూపాల్లో అవకాశాలు..
నవంబర్ 8 నుంచి రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో మార్చుకునేందుకు వివిధ రకాల ఆప్షన్లు ఇచ్చింది. ఈ నోట్ల మార్పిడి రోజుకు నాలుగు వేల చొప్పున ఆ నెల మొత్తం అవకాశం ఇచ్చింది. దీంతోపాటు ప్రభుత్వ పన్నుల చెల్లింపునకూ రూ. వెయ్యి, రూ.500 నోట్లను అంగీకరించింది. పన్నులు చెల్లింపునకు మూడు సార్లు గడువు పెంచుతూ వచ్చింది. చివరిగా డిసెంబర్ 15 వరకు గడవు ఇచ్చింది. తదనంతరం పాత నోట్లను బ్యాంకుల్లో వారివారి ఖాతాల్లో జమ చేసేందుకు నిబంధన విధించింది. మార్చుకోవడంతోపాటు పన్నులు చెల్లించగా మిగిలిన నోట్లను జమ చేసుకునేందుకు డిసెంబర్ 30 వరకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో నల్లకుబేరులు శత విధాలు ప్రయాత్నిస్తునే ఉన్నారు.
పాత నోట్లు దొరికితే జైలే..
రద్దు చేసిన పెద్ద నోట్లను బ్యాంకులో జమ చేయడానికి గడవు ముగిసినందునా ఇక ఈ నోట్లు దేనికీ ఉపయోగపడవు. ఆర్బీఐ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పలు రకాల నిబంధనలతో మార్చి 31 వరకు జమ చేసుకునేందుకు గడువు ఉంది. తదుపరి కూడా ఈ నోట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. రద్దుచేసిన నోట్లు రూ.10 వేల వరకు ఉంటే పెద్దగా పట్టించుకోరు. కానీ.. అంతకుమించి ఎక్కువ ఉన్నా.. ఇతరులకు బదిలీ చేసినా శిక్షార్హులే అవుతారు.
నల్లకుబేరుల్లో రైళ్లు పరుగు..
పెద్ద మొత్తంలో అక్రమంగా సంపాదించిన నగదు పాత రూ.500, 1000 నోట్లను మార్చుకునేందుకు నల్లకుబేరులు గడిచిన 50 రోజులు శతవిధాలా ప్రయత్నించారు. నోట్ల మార్పిడికి కమీషన్ ఏజెంట్లను సైతం ఆశ్రయించారు. జిల్లాలో ఎక్కువగా రియల్ ఎస్టేట్, బంగారం, ఇతర వ్యాపారుల ద్వారా అక్రమంగా సంపాదించిన వారు నగుదు మార్చుకునేందకు పలు అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. ఇప్పటికే నగదు మార్పిడి చేస్తూ కొంత మంది కమీషన్ ఏజెంట్లు పట్టుబడ్డ సంఘటనలూ ఉన్నాయి. నల్లకుబేరులు పేదలను పావులుగా వాడుకొని జన్‌ధన్ ఖాతాల్లో సైతం డిపాట్ చేయించినట్లు తెలుస్తోంది. నోట్లు రద్దయిన వారం రోజుల్లో పెద్ద మొత్తంలో బంగారం విక్రయాలు కూడా పెరిగాయి. రూ.500, 1000 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకు, పోస్టాఫీసుల్లో సుమారుగా రూ.600 కోట్ల నోట్లను జమచేసినట్లు తెలుస్తోంది.