వేతన జీవులు విలవిల..
సాక్షి, సిటీబ్యూరో: నెల నెలా జీతం డబ్బులు చేతికందితే తప్ప బతుకుబండి ముందుకు సాగని వేతన జీవులకు కరెన్సీ కొరత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. బ్యాంకుల్లోంచి తగినంత నగదు డ్రా చేసేందుకు అవకాశం లేక, ఏటీఎంలలో డబ్బుల్లేక ప్రజలు కరెన్సీ కష్టాలను అనుభవిస్తున్నారు. నగరంలో తెరిచి ఉన్న ఏటీఎంల వద్ద ఫర్లాంగుల కొద్దీ క్యూలే దర్శనమిస్తున్నాయి. మరోవైపు నూటికి తొంభై శాతం ఏటీఎంలు ‘నో క్యాష్ ’ బోర్డులతోనే కనిపిస్తున్నాయి. ప్రతి నెలా మొదటి వారంలోనే జీతాలు అందుకొని ఇంటి అద్దెలు, పాలు, పేపర్, పిల్లల ఫీజులు, నిత్యావసరవస్తువులు, ఆటోచార్జీలు, వంటగ్యాస్, బస్‌పాస్‌లు వంటివి తెచ్చుకొనే సగటు నగర జీవి ప్రతి రూపాయి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. సోమవారం కూడా నగరంలో ఇదే పరిస్థితి నెలకొంది. నగరమతటా నోటు కష్టాలే కనిపించాయి. వారానికి రూ.24 వేలు చెల్లిస్తాయన్న బ్యాంకులు రూ. 3 వేల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. దీంతో అవసరాలకు డబ్బుల్లేక ఏటీఎంలను ఆశ్రయిస్తే గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మొదటి తారీఖు దాటి రెండు వారాలు కావస్తున్నా ఇంటి కిరాయీలు చెల్లించకపోవడంతో ఓనర్ల నుంచి ఒత్తిళ్లు తప్పడం లేదు. బియ్యం, పప్పులు, వంటనూనెలు, తదితర అవసరాల కోసం, ఇతరత్రా ఖర్చుల కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తుందని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏ ఇద్దరి నోట విన్నా నోటు కష్టాలే వినిపిస్తున్నాయి. నలుగురు కలిసిన చోట నోట్ల బాధలే ఏకరువు పెడుతున్నారు.
ఆకస్మాత్తుగా ఏటీఎంల మూత...
మరోవైపు ఎంతో ఆశగా ఏటీఎంల వద్ద పడిగాపులు కాసేవాళ్లకు ఒకవైపు తాము లైన్‌లో నించొని ఉండగానే ఏటీఎంలలో డబ్బులు ఖాళీ అయిపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఉస్సూరంటూ వెనుదిరగాల్సి వస్తోంది.తెల్లవారు జామున, అర్దరాత్రి పూట కూడా జనం ఏటీఎంల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. నగరంలోని సికింద్రాబాద్, ఆబిడ్స్,కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పని చేయని ఏటీఎంలు, ఉన్న చోట భారీ క్యూలైన్‌లు, బ్యాంకుల్లో తగినన్ని డబ్బులు చేతికందక వెనుదిరిగే వచ్చే ఖాతాదారులు కనిపిస్తున్నారు. నోట్ల రద్దు అనంతరం నెలకొన్న కష్టాలు, బాధలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ ఏ మాత్రం తగ్గడం లేదు.