నోక్యాష్ బోర్డులు.. తెరుచుకోని ఏటీఎంలు
నోక్యాష్ బోర్డులు.. తెరుచుకోని ఏటీఎంలు
Published Tue, Dec 6 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
నగదు కొరతతో ఉక్కిరిబిక్కిరి
- డిపాజిట్లు రూ.5వేల కోట్లు.. జిల్లాకు వచ్చిన కొత్త కరెన్సీ రూ.760 కోట్లే
- ఆన్‌లైన్ లావాదేవీలకు అన్నీ సమస్యలే
కర్నూలు(అగ్రికల్చర్): నగదు కొరత అన్ని వర్గాల ప్రజలను ఉక్కిరి, బిక్కిరి చేస్తోంది. నగదు రహిత లావాదేవీలపై అవగాహన లేక ఉద్యోగ, వ్యాపార వర్గాలే అల్లాడిపోతుంటే.. గ్రామీణ ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. దాదాపు 20 రోజులుగా ఆన్‌లైన్ లావాదేవీలపై జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు దక్కని పరిస్థితి. అనేక మందికి ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు లేకపోవడం, ఉన్నా వాటికి ఆన్‌లైన్ సదుపాయం లేకపోవడంతో నగదు రహిత లావాదేవీలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇకపోతే మంగళవారం జిల్లాలో దాదాపు ఏ బ్యాంకులోనూ నగదు లేకపోవడంతో లావాదేవీలు స్తంభించాయి. నగదు కొరత కారణంగా ఇప్పటికీ వందలాది మంది ఉద్యోగులు నవంబర్ నెల జీతంలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రోజూ జీతంలో కనీసం రూ.10వేలు తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్తున్నా నో క్యాష్ బోర్డులు కనిపిస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర అర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచ్‌లో మంగళవారం నో క్యాష్ బోర్డు పెట్టడం ఉద్యోగులను నిరాశకు గురిచేసింది.
బ్యాంకుల్లో డబ్బుల్లేవ్.. ఏటీఎంల మూత
పెద్దనోట్ల రద్దు తర్వాత జిల్లాకు వచ్చిన కొత్త కరెన్సీ కేవలం రూ.760 కోట్లు మాత్రమే. రద్దయిన పెద్దనోట్లు మాత్రం బ్యాంకులకు డిపాజిట్లుగా రూ.5వేల కోట్లకు పైగా వచ్చాయి. రద్దయిన కరెన్సీని అన్ని బ్యాంకులు ఆర్‌బీఐకి పంపుతాయి. అక్కడి నుంచి అంతే మొత్తంలో కరెన్సీ రావాలి. కానీ 20 శాతం కూడా జిల్లాకు కొత్త కరెన్సీ రాకపోవడంతో నగదు కొరత తీవ్రమైంది. జిల్లాలో ప్రధాన బ్యాంకులైన ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంకు సహా ఎక్కడా డబ్బులేని పరిస్థితి. కెనరా బ్యాంకు, ఏపీజీబీ, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తదితర బ్యాంకులు నగదు లేక సంక్షోభంలో పడ్డాయి. మామూలుగా అయితే బ్యాంకుల్లో రూ.100 కోట్లకు పైగా నగదు ఉండాలి. అలాంటిది జిల్లాలోని 445 బ్రాంచ్‌ల్లో రూ.10కోట్లు కూడా లేకపోవడం గమనార్హం. కొన్ని బ్యాంకుల్లో ఖాతాదారులకు రూ.4వేల వరకు నగదు చెల్లిస్తుండగా.. పలు బ్యాంకులు నోక్యాష్ బోర్డులతో సరిపెడుతున్నాయి. జిల్లాలో 485 ఏటీఎంలు ఉండగా 95 శాతం మూతపడ్డాయి. గతంలో ఎప్పుడూ మూతపడని ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలు పూర్తిగా మూతేశారు. ఎస్‌ఐబీ ఏటీఎంలు జిల్లా వ్యాప్తంగా ఐదురు మాత్రమే సేవలందిస్తున్నాయి.
ఆన్‌లైన్ సదుపాయం లేక..
నగదు కొరత నేపథ్యంలో ఆన్‌లైన్ లావాదేవీలకు ప్రాధాన్యత ఏర్పడింది. నేడు జిల్లా యంత్రాంగం అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టి దీనిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది. కానీ బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్ సదుపాయం లేకపోవడంతో ఇది అమలు కావడం కష్టంగా మారింది. జిల్లాలో జన్‌ధన్ ఖాతాలు 6.93 లక్షలు, ఎస్‌బీ ఖాతాలు 40లక్షలకు పైగా ఉన్నా 50 శాతం ఖాతాలకు కూడా అన్‌లైన్ సదుపాయం లేదు. ఇందువల్ల నగదు రహిత లావాదేవీలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
Advertisement
Advertisement