‘స్టాండప్ ఇండియా’ స్కీమ్ రేపటి నుంచే
ఎస్‌సీ/ఎస్‌టీ మహిళా వ్యాపారులకు రూ. కోటి వరకూ రుణం
ప్రారంభించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దళిత, గిరిజన(ఎస్‌టీ/ఎస్‌టీ) మహిళా వ్యాపారవేత్తలకు బ్యాంకుల నుంచి రూ. కోటి వరకూ రుణాలను అందించే ‘స్టాండప్ ఇండియా’ స్కీమ్‌ను ఈ నెల 5న(రేపు) ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. నోయిడాలో జరిగే కార్యక్రమంలో ఈ స్కీమ్‌తో పాటు దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్‌ను కూడా ఆరంభిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జయంత్ సిన్హా తదితరులు దీనికి హజరుకానున్నారు. ఏదైనా కొత్త వ్యాపార సంస్థను(వ్యవసాయేతర) ఆరంభించాలనుకునే ఎస్‌సీ/ఎస్‌టీ మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నారు. దీనిప్రకారం వారికి రూ.10 లక్షల నుంచి రూ. కోటి వరకూ రుణాలను అందించేలా చూస్తారు. ప్రతి బ్యాంక్ బ్రాంచ్ నుంచి ఇలాంటి రెండు ప్రాజెక్టులకు రుణం అందించాల్సి ఉంటుందని, ప్రతి ఎంట్రప్రెన్యూర్ కేటగిరీలో కనీసం సగటున ఒకరికి రుణం ఇస్తారని ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఈ రుణాలు తీసుకునేవారికి డబ్బు విత్‌డ్రాయల్స్ కోసం రూపే డెబిట్ కార్డును ఇవ్వడంతోపాటు రుణానికి ముందు మార్కెటింగ్ ఇతరత్రా అంశాల్లో శిక్షణను కూడా అందిస్తారని పేర్కొంది. కాగా, ఈ స్కీమ్ కోసం సిడ్బి రూ.10,000 కోట్ల రీఫైనాన్స్ సదుపాయాన్ని కల్పించనుండగా, నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ(ఎన్‌సీజీటీసీ) రూ.5,000 కోట్లతో మూల నిధి(కార్పస్)ని ఏర్పాటు చేయనుంది. కాగా, స్కీమ్ ప్రారంభం సందర్భంగా 5,100 ఈ-రిక్షాలను మోదీ పంపిణీ చేయనున్నారు. ప్రధాన మంత్రి ముద్రా యోజనలో భాగమైన మైక్రో క్రెడిట్(బీఎంసీ) ద్వారా వీటిని అందిస్తున్నారు.