స్టాక్స్ వ్యూ
హిందాల్కో
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.172 టార్గెట్ ధర: రూ.234
ఎందుకంటే: హిందాల్కో.. పటిష్టమైన బిజినెస్ మోడల్ కంపెనీ సొంతం. మైనింగ్ కార్యకలాపాలు, వాహనాలకు, బేవరేజేస్ క్యాన్లకు అవసరమయ్యే అల్యూమినియం ఉత్పత్తులందిస్తోంది. స్పెషల్ గ్రేడ్ అల్యూమినాను తయారు చేస్తోంది. కంపెనీ పూర్తి రుణభారాన్ని తీర్చివేయగలిగే స్థాయిలో స్పెషల్ గ్రేడ్ అల్యూమినా వ్యాపారం ఉంది. దేశీయంగా బొగ్గు, బాక్సైట్ సరఫరాలు మెరుగుపడడం వల్ల ఉత్పత్తి వ్యయాలు తగ్గుతున్నాయి. వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ల వల్ల రవాణా వ్యయాలు కూడా తగ్గుతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు తగ్గడం.. వల్ల అల్యూమినియం వ్యాపారానికి బాగా ప్రయోజనం కలుగుతోంది. సొంత బాక్సైట్ గనులు, అల్యుమినా రిఫైనరీ, విద్యుత్ ప్లాంట్ల కోసం గతంలో పెట్టిన 600 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఫలాలు ఇప్పుడు కంపెనీకి అందుతున్నాయి. అధిక మార్జిన్లు వచ్చే వాహన విడిభాగాల కోసం అమెరికాలో డిమాండ్ పెరగడం వల్ల హిందాల్కో అనుబంధ కంపెనీ, అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నొవాలిస్ వార్షిక ఇబిటా 110 కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. భారత్‌లో బెంచ్‌మార్క్ వడ్డీరేట్లు తగ్గుతుండడం వల్ల, అమెరికాలో బాండ్ల రీఫైనాన్స్ వల్ల కంపెనీ రుణ, వడ్డీ భారాలు తగ్గనున్నాయి. ఇప్పటికే నొవాలిస్ కంపెనీ 250 కోట్ల డాలర్ల రుణాలను రీ ఫైనాన్స్ చేసింది. దీంతో 5.5 కోట్ల డాలర్ల వడ్డీ ఆదా అయింది. మరో 200 కోట్ల డాలర్ల రుణాలను రీ ఫైనాన్స్ చేయనున్నది. ఫలితంగా మరో 2.5 కోట్లు డాలర్లు ఆదా కానున్నాయి. వడ్డీరేట్ల తగ్గుదల వల్ల భారత్‌లో 3 కోట్ల డాలర్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా. పదేళ్ల తర్వాత కంపెనీకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న ఫ్రీ క్యాష్ ఫ్లోస్, తరుగుతున్న రుణ, వడ్డీ భారాలు ఈక్విటీ విలువను పెంచుతున్నాయి. ఉత్పత్తి వ్యయాలు తగ్గించుకోవడం, అధిక లాభాలు వచ్చే వాహన కంపెనీలకు హిందాల్కో అనుబంధ కంపెనీ నొవాలిస్ అమ్మకాలు పెరగడం, మూలధన కేటాయింపుల్లో గట్టి క్రమశిక్షణ, జోరుగా ఉన్న ఫ్రీ క్యాష్ ఫ్లోస్(ఎఫ్‌సీఎఫ్), రుణాలను రీ ఫైనాన్స్ చేయడం ద్వారా బాగా తగ్గుతున్న వడ్డీ భారం (ఏడాదికి 11 కోట్ల డాలర్ల వడ్డీ వ్యయాలు ఆదా అవుతాయని అంచనా)... ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు.
హెచ్‌డీఎఫ్‌సీ
బ్రోకరేజ్ సంస్థ: జియోజిత్ బీఎన్‌పీ పారిబా
ప్రస్తుత ధర: రూ.1,248 టార్గెట్ ధర: రూ.1,400
ఎందుకంటే: ఇతర హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో పోల్చితే మంచి స్థాయిలో ఉంది. దేశవ్యాప్తంగా 2,400 నగరాలు, పట్టణాలకు అందుబాటులో ఉండేలా 285 కార్యాలయాలతో సేవలందిస్తోంది. గత రెండేళ్లుగా దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, తక్కువ మొండి బకాయిలతో ఆరోగ్యకరమైన పనితీరును సాధించింది. వ్యక్తిగత రుణ సెగ్మెంట్లో మంచి వ్యాపారం సాధించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో రుణ వృద్ధి 16 శాతంగా ఉంది. రుణ నాణ్యత నిలకడగా ఉంది. స్థూల మొండి బకాయిలు 1 బేసిస్ పాయింట్ మాత్రమే పెరిగి 0.8%కి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో నిర్వహణ ఆస్తులు 17% వృద్ధి చెందాయి. అయితే రియల్టీ రంగంలో మందగమనం కారణంగా కార్పొరేట్ రుణ వృద్ధి 13%గానే ఉంది.పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా రియల్టీ ధరలు తగ్గడం వల్ల కంపెనీపై ప్రభావం స్వల్పంగానే ఉంటుందని అంచనా వేస్తున్నాం. మొత్తం లోన్‌బుక్‌లో ఆస్తుల తనఖాగా ఇచ్చిన రుణాలు 5%గా ఉండడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలానికి నికర వడ్డీ ఆదాయం 11% వృద్ధి చెందింది. పోటీ పెరగడం, అధిక మార్జిన్లు వచ్చే కార్పొరేట్ రుణ వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్ 7 బేసిస్ పాయింట్లు తగ్గి 3.1%కి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో రుణ వృద్ధి మందగించినా, ఈ రంగంలో అగ్రస్థానంలో ఉండడంతో దీర్ఘకాలంలో హెచ్‌డీఎఫ్‌సీకి ఢోకా లేదని చెప్పవచ్చు. సమీప భవిష్యత్తులో హౌసింగ్ ఫైనాన్స్ రంగంపై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే హెచ్‌డీఎఫ్‌సీకి మంచి అవకాశాలే ఉన్నాయని చెప్పవచ్చు. వ్యాపారంలో మంచి వృద్ధి, మార్జిన్లు నిలకడగా వృద్ధి సాధిస్తుండడం, రుణ నాణ్యత ఆరోగ్యకరంగా ఉండడం సానుకూలాంశాలు. అనుబంధ సంస్థలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, గృహ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ వ్యాపారాలు కూడా మంచి పనితీరు కనబరుస్తున్నాయి. రెండేళ్లలో నికర వడ్డీ ఆదాయం 12%, నికర లాభం 14% చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. రెండేళ్లలో స్థూల మొండి బకాయిలు 1%గానే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.