
గ్యాంగ్ 'లీడర్లు'
తెలుగు చిత్రసీమలో 80 ... 90 దశకాలలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల ఆనందానికి అవధులే ఉండేవి కావు.
తెలుగు చిత్రసీమలో 80 ... 90 దశకాలలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల ఆనందానికి అవధులే ఉండేవి కావు. వారు జంటగా నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్టు అవుతాయని వారి అభిమానులు పందాల మీద పందాలు కాసుకునే వారు. వారిద్దరు జంటగా నటించిన చిత్రాలు విడుదలయ్యాయంటే టాలీవుడ్లో బాక్సాఫీసులు బద్దలవ్వాల్సిందే.
అయితే ఆ ఇద్దరు జంటగా నటించిన చిత్రాలు ఎన్ని వచ్చినా వారి ఆఖరి చిత్రం మాత్రం 'గ్యాంగ్ లీడర్'. ఆ చిత్రం టాలీవుడ్ చరిత్రలో కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషన్లో మెకానిక్ అల్లుడు చిత్రం వచ్చింది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో చిత్రం రాలేదు. అయితే చూడబోతే ఆ గ్యాంగ్ 'లీడర్లు' ఇద్దరు ఒకే దారిలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. చిత్ర రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టి ఆ తర్వాత టీఆర్ఎస్లో విలీనం చేసింది. అనంతరం ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి వరుసగా రెండు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికై లోక్సభలో అడుగుపెట్టింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతున్న క్రమంలో విజయశాంతి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి... 'హస్తం' అందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ స్థానం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి చేతిలో ఓటమీ పాలైంది. తాను పట్టుకున్న హస్తం కాస్తా భస్మాసుర హస్తం కావడంతో అప్పటి వరకు వైలెంటుగా ఉన్న రాములమ్మ ఒక్కసారిగా సైలంట్ అయింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎట్టకేలకు రాములమ్మ తన మౌనాన్ని వీడింది. భవిష్యత్తులో 'చెయ్యి' పట్టుకునే నడుస్తానని అంటూనే... తెరపై మరోసారి వెలిగిపోవాలని ఉబలాటపడుతోంది. అందుకోసం సెకండ్ ఇన్నింగ్స్ సార్ట్ చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. అది దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న చిత్రంలో రాములమ్మ నటించేందుకు కథ సిద్ధమవుతుందని తెలిసింది.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి... ఆ తర్వాత ఆ పార్టీని హస్త'గతం' చేసి రాజ్యసభకు వెళ్లారు. ఎన్నికల్లో 'హస్తం' హవా తగ్గడంతో ఆయన కూడా 150 చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గ్యాంగ్ లీడర్ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించి ఆ ఇద్దరి ఆలోచనలు మాత్రం ఒకేలా భలే కలిశాయి కదూ. కాంగ్రెస్ పార్టీకి జనంలో మళ్లీ క్రేజీ పెరిగే వరకు ఈ ఇద్దరు తమ క్రేజీ ఎక్కడ తగ్గకుండా ఉండేందుకు జనంలో మళ్లీ 'తెరవేల్పు'లై పోవాలని నిర్ణయించుకున్నట్లు ఉన్నారు. దటీజ్ గ్యాంగ్ 'లీడర్లు'.