అధికార బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాసిన ఓ పుస్తకానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది.
న్యూఢిల్లీ: అధికార బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాసిన ఓ పుస్తకానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ఆయన రాసిన పుస్తకం దేశంలో హిందూ, ముస్లింల మధ్య మతవిద్వేషాన్ని రెచ్చగొట్టేవిధంగా ఉందని నివేదించింది. 2006లో సుబ్రహ్మణ్యస్వామి ప్రచురించిన 'టెర్రరిజం ఇన్ ఇండియా' (భారత్‌లో ఉగ్రవాదం) పుస్తకానికి వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించేవిధంగా ఈ పుస్తకం ఉందని పేర్కొంది. భారతంలోని ఓ వర్గం ప్రజలకు వ్యతిరేకంగా పుస్తకం సుబ్రహ్మణ్యస్వామి విద్వేష ప్రసంగాలు చేశారని, ఈ పుస్తకంలోని ఇతివృత్తం, భాష, ఉపమానాలు అన్ని రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది.
రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్న బీజేపీ నేతలను, మంత్రులను పార్టీ అధిష్ఠానం నియంత్రించలేకపోతున్నదని, దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోతున్నదని అన్నివైపుల నుంచి కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. అంతేకాకుండా విద్వేష ప్రసంగాలకు నిరోధానికి భారతా శిక్షాస్మృతిలోని కఠిన నిబంధనలు కొనసాగించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయానికి కేంద్రం మద్దతు తెలిపింది. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాన్ని పెంచేవిధంగా ప్రవర్తిస్తున్న బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిపై విచారణ జరుపడానికి మద్దతు పలికింది.