న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్రజేసింది. రాజకీయ నాయకులు మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఆపినప్పుడే వాటికి అడ్డుకట్ట పడుతుందని పేర్కొంది. ‘‘దేశం ఎటు పోతోంది? విద్వేష ప్రసంగాలు ఓ విషవలయం. రాజకీయాలను మతంలో కలపడం పెను సమస్యకు దారి తీస్తోంది. విచ్ఛిన్న శక్తులే ఇందుకు పాల్పడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తక్షణం ఓ మార్గం చూడాలి’’ అని న్యాయమూర్తులు కె.ఎం.జోసెఫ్, బి.వి.నాగరత్న ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది.
ఇటీవలి తీర్పులోనూ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని నొక్కిచెప్పిందని గుర్తు చేసింది. ‘‘టీవీల్లో, మీడియాలో, బహిరంగ వేదికలపై రోజూ ఇలాంటి శక్తులు ఇతరులపై విద్వేష వ్యాఖ్యలకు పాల్పడుతూనే ఉన్నాయి. ఎంతమందిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టగలం? తోటివారిపై, సామాజిక వర్గాలపై విద్వేష వ్యాఖ్యలు చేయబోమని ప్రజలే ప్రతినబూనితే బాగుంటుంది’’ అని సూచించింది. దివంగత ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటివారి ప్రసంగాలు ఎంతో హుందాగా ఉండేవంటూ గుర్తు చేసింది.
వాడీవేడి వాదనలు..
‘‘విద్వేష ప్రసంగాలపై సకాలంలో చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిస్తేజంగా మారాయి. అందుకే కోర్టులకు పని పడుతోంది’’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలా మౌనంగా ఉండే పక్షంలో ప్రభుత్వాల ఉనికికి అర్థమేముందని ప్రశ్నించింది? రాష్ట్రాల సంగతేమో గానీ ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి వర్తించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. కేరళ, తమిళనాడుల్లో నేతల విద్వేష ప్రసంగాల ఉదంతాలను కూడా ఈ పిటిషన్‌తో కలిపి విచారించాలని కోరారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్‌ల ప్రదర్శనకు అనుమతించాలని కోరడంతో దీన్నో డ్రామాగా మార్చొద్దని ధర్మాసనం పేర్కొంది. ‘‘దేనికైనా ఓ పద్ధతుంటుంది. మేం వీడియో క్లిప్‌లు చూడాలని మీరు భావిస్తే దాన్ని మీ పిటిషన్లో చేర్చండి’’ అని సూచించింది. విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment