పాక్ చర్చిపై ఉగ్ర పంజా | Suicide bombers kill 78 Christians outside Pakistani church | Sakshi
Sakshi News home page

పాక్ చర్చిపై ఉగ్ర పంజా

Published Mon, Sep 23 2013 12:46 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM

పాక్ చర్చిపై ఉగ్ర పంజా - Sakshi

పాక్ చర్చిపై ఉగ్ర పంజా

పెషావర్: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ నెత్తుటేర్లు పారించారు. ప్రార్థన కోసం చర్చికి వెళ్లిన అమాయక  ప్రజలపై పంజా విసిరారు. ఆదివారం ఖైబర్ పక్తూన్‌ఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌లోని చారిత్రక చర్చిపై ఇద్దరు తాలిబన్ ఆత్మాహుతి బాంబర్లు జరిపిన దాడుల్లో 78 మంది మృతిచెందగా, 130 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో  30 మంది మహిళలు, ఏడుగురు పిల్లలు ఉన్నారు. పాక్‌లో క్రైస్తవ మైనారిటీలపై ఇదే అతి పెద్ద దాడి. కొహాటీ గేట్ ప్రాంతంలోని ఆల్ సెయింట్స్ చర్చిలో ప్రార్థనల తర్వాత, పేదలకు ఆహారం అందించేందుకు బయటకొచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకుని తొలి బాంబర్   తనను తాను పేల్చేసుకున్నాడు. తర్వాత అర నిమిషంలోపే మరో బాంబర్ ఇదే ఘాతుకానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో చర్చి లోపల 700 మంది ఉన్నారు. పేలుళ్ల ధాటికి చర్చి పక్కనున్న భవనాలు దెబ్బతిన్నాయి.
 
 చర్చి గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తెగిపడిన అవయవాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి భీతావహంగా కనిపించింది.  ఈ చర్చిని 1883లో బ్రిటిష్ హయాంలో నిర్మించారు. మృతుల్లో మూడు నుంచి ఐదేళ్ల మధ్య వయసున్న నలుగురు పిల్లలు, చర్చి గార్డుగా పనిచేస్తున్న ముస్లిం పోలీసు ఉన్నారు. ఘాతుకానికి పాల్పడిన ఒక్కో బాంబర్ వద్ద ఆరు కేజీల పేలుడు పదార్థాలున్న జాకెట్ ఉందని పోలీసులు చెప్పారు. క్షతగాత్రుల్లో చాలా మందిని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించారు.  క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ నరమేధంపై పాక్ క్రైస్తవులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. పెషావర్ దాడిలో బలైన వారి మృతదేహాలను తీసుకొచ్చి రోడ్లను దిగ్బంధించారు. దాడిని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు మతం లేదని, వారు ఇస్లాంకు విరుద్ధంగా అమాయకుల ఉసురు తీస్తున్నారని మండిపడ్డారు. తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దాడిని భారత ప్రధాని మన్మోహన్ కూడా ఖండించారు.
 
 అమెరికా దాడులకు ప్రతీకారం: తాలిబన్లు
 ఈ దాడికి పాల్పడింది తామేనని ‘తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్’కు చెందిన జుందల్లా వర్గం ప్రతినిధి అహ్మద్ మర్వాత్ ప్రకటించాడు. పాక్‌లో అమెరికా ద్రోన్ విమాన దాడులకు ప్రతీకారంగా దీనికి తెగబడ్డామన్నాడు. ద్రోన్ దాడులను ఆపేంతవరకు ముస్లిమేతరులపై దాడులు చేస్తూనే ఉంటామని హెచ్చరించాడు.  షియా, అహ్మదీ వంటి మైనారిటీలపై తరచూ దాడులు జరిగే పాక్‌లో క్రైస్తవులపై ఇదే అతి పెద్ద దాడి అని అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement