పాట్నా: దేశంలో ప్రతి ఇంటికీ ఓ మరుగుదొడ్డి నిర్మాణం కోసం తన వంతుగా సాయంగా సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నదని ఆ సంస్థ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్ తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. సామాజిక సేవా సంస్థ సులభ్ ఇంటర్నేషనల్ ద్వారా దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక సంస్కరణలు, వ్యర్థాల నిర్వహణ వంటి సేవలు పాఠక్ చేస్తున్నారు.
పాట్నా జిల్లాలోని సాడిసోపూర్‌కు చెందిన ఓ పేద మహిళకు ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మించుకునేందుకుగాను రూ.1.5 లక్షల చెక్కును శనివారమిక్కడ ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు గంగానది ప్రక్షాళనకు కూడా సులభ్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసేందుకూ తాను సిద్ధమని తెలిపారు.