సూర్యుడు నిద్రపోతాడా?!
మరో మంచుయుగం.. ముంచు కొస్తోందా?
భగభగ మండుతూ సెగలు కక్కే ప్రచండ భానుడు మరో దశాబ్దం తర్వాత చల్లబడతాడా? దాదాపు దశాబ్దం పాటు నిద్రపోతాడా? 370 సంవత్సరాల క్రితం లండన్‌లోని థేమ్స్ నది సైతం గడ్డకట్టుకుపోయినట్లుగా మరోసారి మినీ మంచుయుగం ముంచుకొస్తుందా? సూర్యుడి వలయాల అధ్యయనంలో తేలిన అంశాలను బట్టి చూస్తే.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు! సూర్యుడిలో పదకొండేళ్లకోసారి ఒక వలయం పూర్తయి మరో వలయం ప్రారంభమవుతుంటుంది. దీనినే సూర్యుడి గుండె లయగా భావిస్తుంటారు. సౌర వలయాల్లో తరచూ అనూహ్య మార్పులు జరుగుతుంటాయి. వీటివల్ల సూర్యుడిపై నల్లమచ్చలు పెరిగి క్రియాశీలత ఎక్కువ కావడం లేదా తగ్గిపోవడం సంభవిస్తుంటుంది. అయితే, 2030-40 మధ్య ఏర్పడనున్న సౌర వలయ సమయంలో సూర్యుడు దాదాపుగా నిద్రలోకి జారుకుంటాడని, 1646-1715 కాలంలోఏర్పడినట్లు మినీ మంచుయుగం రావచ్చని బ్రిటన్ శాస్త్రవేత్త వాలెంటినా హెచ్చరించారు.
వేల్స్‌లోని లియాన్‌డిడ్‌నోలో జరిగిన జాతీయ ఖగోళ సదస్సులో వాలెంటినా అధ్యయన ఫలితాలను వెల్లడించారు. వాలెంటినా అంచనా ప్రకారం... 2030 సౌరవలయ సమయంలో ‘మాండర్ మినిమమ్’ ప్రభావం ఏర్పడేందుకు 97 శాతం అవకాశముంది. సూర్యుడిలో రెండు పొరల్లో ఏర్పడిన విద్యుదయస్కాంత క్షేత్రాలు పెరుగుతూ, తరుగుతూ పదకొండేళ్లపాటు కొనసాగుతుంటాయి. ఈ రెండు పొరల్లోని విద్యుదయస్కాంత తరంగాలు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా సూర్యుడిపై నల్లమచ్చలు, క్రియాశీలత మారుతుంటుంది. ఈ క్రియాశీలత పూర్తిగా తగ్గిపోవడాన్నే మాండర్ మినిమమ్‌గా పేర్కొంటారు. 2030 సౌరవలయంలో ఈ ఎఫెక్ట్ ఏర్పడి, మినీ ఐస్ ఏజ్ రావచ్చని, శీతల దేశాల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారతాయని అంచనా.