సునంద పుష్కర్ కేసులో మరో ట్విస్ట్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కాంగ్రెస్ నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ కేసులో కీలక పురోగతి సాధించింది. ఢిల్లీ పోలీసులు ఎదురు చూస్తున్న ఎఫ్ బీ ఐ ఫోరెన్సిక్ రిపోర్టు ఎట్టకేలకు వారి చేతికి అందింది. అయితే.. ఢిల్లీ పోలీసులు భావించినట్లు సునంద మరణానికి రేడియో ధార్మిక పదార్థం కారణం కాదని ఎఫ్ బీ ఐ రిపోర్టు స్పష్టం చేసింది.
సునంద పుష్కర్ మృతికి కారణాలు తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారుల సాయం కోరిన సంగతి తెలిసిందే. తొమ్మిది నెలల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టు వివరాలు ఎఫ్ బీఐ సీల్డ్ కవర్ లో ఢిల్లీ పోలీసులకు అందింది.
సునందా పుష్కర్ను చంపడానికి నిందితులు ఉపయోగించిన విషపదార్థం పేరు 'పొలోనియం' అని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారు. ఇదే విషయం ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో కూడా ఉంది. అయితే సునంద మృతికి పొలోనియం కారణం కాదని ఎఫ్ బీ ఐ రిపోర్టు స్పష్టంచేసింది. సునంద మరణానికి కారమైన విషపదార్థం పేరును రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ రిపోర్టుపై ఢిల్లీ పోలీసులు నోరు మెదపడం లేదు.
కాగా.. ఎఫ్ బీ ఐ రిపోర్టును గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బాసీ ఓ ఆంగ్ల దిన పత్రికతో మాట్లాడుతూ "త్వరలోనే కేసుకు సంబంధించిన కొన్ని నిజాలు తెలుస్తాయి' అని తెలిపారు. ఈ రిపోర్టుతో కేసుకు సంబంధించిన అనేక చిక్కుముడులు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
సునంద మృతి కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ ఆరుగురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. సునంద భర్త కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ తో సహా ఆరుగురు నిందితులకు పాలి గ్రాఫీ పరీక్షలు సైతం నిర్వహించారు.
గత ఏడాది జనవరి 17న ఢిల్లీలోని లీలా హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్‌తో ట్విట్టర్‌లో తీవ్ర మాటల యుద్దం జరిగిన ఒక్క రోజు లోపే సునంద మృతి చెందడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఎఫ్ బీ ఐ తాజా రిపోర్టుతో కేసు విచారణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.