
హత్యకేసులో నన్ను ఇరికించే కుట్ర: థరూర్
తన భార్య సునందా పుష్కర్ హత్యకేసులో తనను ఇరికించే కుట్ర జరుగుతోందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆరోపించారు. సునందది హత్య అన్న విషయం ఇంకా వెలుగులోకి రాకముందే.. అంటే నవంబర్ 12వ తేదీనే ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సికి ఆయన ఓ లేఖ రాశారు. ఢిల్లీ పోలీసులు తరచు తన ఇంట్లో పనిచేసే మనిషి నారాయణ్ సింగ్ను శారీరకంగా హింసించి, భయపెట్టి, ఈ హత్య తామిద్దరం కలిసి చేసినట్లుగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, అక్రమమని థరూర్ అన్నారు.
కేసు విచారణలో తాను, తన సిబ్బంది ఎప్పుడూ పోలీసులకు సహకరిస్తూనే ఉన్నామని చెప్పారు. నవంబర్ 7, 8 తేదీల్లో నారాయణ్ సింగ్ను మొత్తం 30 గంటల పాటు విచారించారని, ఆ సందర్భంగా ఓ అధికారి అతడిని తీవ్రంగా హింసించారని ఆరోపించారు. నిర్దోషిని శారీరకంగా హింసించి ఎలాగోలా హత్యారోపణలు నిరూపించాలన్నదే వారి ఉద్దేశంలా కనపడుతోందని థరూర్ అన్నారు. సదరు పోలీసు అధికారిపై తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 51 ఏళ్ల సునందా పుష్కర్ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో గత సంవత్సరం జనవరి 17న అనుమానాస్పద స్థితిలో మరణించడం, దాన్ని హత్య అని ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదిక నిర్ధారించడంతో కేసును కూడా హత్యకేసుగా మార్చడం తెలిసిందే.