
శశిథరూర్, సునందా పుష్కర్.. ఓ పాక్ జర్నలిస్టు
తరచు వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి శశిథరూర్, సునంద పుష్కర్ దంపతులు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్పై శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ చేసిన ట్వీట్స్ కలకలం సృష్టిస్తున్నాయి. మెహర్ను....ఐఎస్ఐ తీవ్రవాదిగా ట్వీట్ చేసిన సునంద... తన భర్తను మెహర్ వేధిస్తోందని ఆరోపించారు. కాగా సునంద ట్వీట్స్పై మెహర్ తరార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సునంద వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేయనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఐఎస్ఐ ఏజెంట్ అవటం అంత ఈజీనా అని మెహర్ ప్రశ్నించారు. వేరే దేశంలో ఉన్న తనకు థరూర్ అకౌంట్ను హ్యాక్ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. అంతేకాకుండా థరూర్ సంబంధం ఉన్నట్లు.... సునంద పుష్కర్ చేస్తున్న ఆరోపణలను సైతం ఆమె ఖండించారు. పెళ్లై...పిల్లలు ఉన్న తనపై ఇటువంటి ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఇలాంటి వదంతులు ఎలా వచ్చాయో అర్థం కావటం లేదన్నారు. ఇవన్నీ పూర్తిగా అసత్యాలని మెహర్ తరార్ స్పష్టం చేశారు. ఓ ఆర్టికల్ కోసం తాను థరూర్ను ఇంటర్వ్యూ చేసినట్లు మెహర్ తరార్ తెలిపారు. ఆ సమయంలో ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినట్లు చెప్పారు. రాజకీయాల గురించి థరూర్ తన అభిప్రాయాలను తెలిపారని, ఇదే విషయాన్ని తాను ట్విట్టర్లో అనేకసార్లు తెలిపానన్నారు.
కాగా శశిథరూర్ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని బుధవారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తన అకౌంట్ను ఎవరో హ్యాక్ చేశారని, సమస్య పరిష్కారం అయ్యేవరకూ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే థరూర్ అకౌంట్ నుంచి పాకిస్తాన్ జర్నలిస్టుకు వెళ్లిన కొన్ని సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
కాగా లేట్ వయసులో ప్రేమించి పెళ్లాడిన శశి థరూర్, సునంద పుష్కర్ల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిన్న ఆమె మాట్లాడుతూ తాను థరూర్ నుంచి విడాకులు కోరునున్నట్లు తెలిపారు. థరూర్కి పాక్కు చెందిన ఓ మహిళా జర్నలిస్టుకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు శశిథరూర్ చెప్పిన కొద్దిసేపట్లోనే సునంద తన భర్తకు పాక్ జర్నలిస్టు మెహర్ తరార్‌తో వివాహేతర సంబంధం ఉందని చెప్పడం విశేషం. ఇక ఈ ట్వీట్స్ యుద్ధం చివరికి ఏ ట్విస్ట్కు తెరతీస్తుందో చూడాలి.