న్యూఢిల్లీ: సైనికదళాల మాజీ అధిపతి జనరల్ వి.కె.సింగ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ల బేషరతు క్షమాపణలను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అంగీకరించింది. అన్నిరకాల తప్పుడు నడవడిక లను మాఫీ చేసే ఉపకరణం పశ్చాత్తాపమని పేర్కొంది. క్షమాపణ హృదయం లోపలినుంచి వచ్చినట్టైతే.. కోర్టు ధిక్కారం అనేది ఇక ఒక సెకను కూడా కొనసాగకూడదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
ఈ మేరకు.. వయసు (పుట్టిన తేదీ) వివాదంపై తామిచ్చిన తీర్పు నేపథ్యంలో కోర్టుపైనా, న్యాయవ్యవస్థపైనా పలు సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జనరల్ వి.కె.సింగ్‌పై సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార కేసును న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎం.లోధా, జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే ఉపసంహరించుకున్నారు. తాము జారీ చేసిన ధిక్కార నోటీసు విషయంలో.. అందులోని యోగ్యత జోలికివెళ్లకుండా వి.కె. సింగ్ తొలి అవకాశాన్నే వినియోగించుకున్నారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. మరోవైపు ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కార కేసు విచారణను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘కోల్‌గేట్’పై సుప్రీంకోర్టు విచారణను ప్రస్తావిస్తూ తాను చేసిన ప్రకటనలపై భూషణ్ కూడా క్షమాపణ చెప్పారు.