
పరస్పర ఆమోదనీయ యంత్రాంగం!
న్యూఢిల్లీ: సహారా గూప్ సంస్థలు రెండు నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.19,000 కోట్లను చెల్లించడంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నిధుల చెల్లింపులకు సంబంధించి ఒక యంత్రాంగానికి రూపకల్పన చేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, సహారా గ్రూప్‌లకు సూచించింది. కేసుకు సంబంధించి రూ.20,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు సిద్ధమేనా? అని సైతం గ్రూప్ సంస్థలను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది.
ఆయా అంశాలపై సెబీ, సహారా గ్రూప్‌లు పరస్పర ఆమోదనీయ అంగీకారానికి రావడానికి వీలుగా కేసు తదుపరి విచారణను అక్టోబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. పూర్వాపరాలకు వెళితే- దాదాపు రూ.19,000 కోట్ల నిధుల చెల్లింపుల్లో విఫలం కావడంపై సహారా గ్రూప్‌పై సెబీ దాఖలు చేసిన మూడు కోర్టు ధిక్కార పిటిషన్లు శుక్రవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చాయి. నిధుల చెల్లింపులకు సంబంధించి తన స్థిరాస్తిని పూచీకత్తుగా ఉంచేందుకు సుబ్రతారాయ్ నేతృత్వంలోని గ్రూప్ ఈ సందర్భంగా అంగీకరించింది. అయితే ఈ విషయంలో సెబీ కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేసింది. సేల్‌డీడ్, ఆస్తుల విలువలను ప్రశ్నించింది. కంపెనీనే ప్రతిపాదిత పూచీకత్తు ఆస్తిని విక్రయించి, రెగ్యులేటర్‌కు ఆ సొమ్మును చెల్లించాలని సెబీ న్యాయవాది పేర్కొన్నారు. దీనితో ఈ మొత్తం వ్యవహారంపై పరస్పర ఆమోదనీయమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. ఇటీవల లండన్‌లో గ్రూప్ కొనుగోలు చేసిన రూ. 256 కోట్ల స్థిరాస్తి అంశం ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. మీడియాలో వచ్చిన ఈ వార్తలే నిజమైతే- కేసులో సెబీకి చెల్లించాల్సిఉన్న నిధుల మొత్తం చెల్లించే సామర్థ్యం సహారాకు ఉన్నట్లేనని కోర్టు వ్యాఖ్యానించింది.
పూర్వాపరాలు...
సహారా గ్రూపులు రెండు- ఎస్‌ఐఆర్‌ఈసీ (సహారా ఇండియా రియల్టీ), ఎస్‌ఐహెచ్‌ఐసీ (సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్) మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్లను వసూలు చేశాయన్నది ఈ కేసులో ప్రధానాంశం. ఈ కేసులో గత ఆగస్టు 31న సుప్రీం రూలింగ్ ఇస్తూ, 2012 నవంబర్ ముగింపునకు ఈ మొత్తాలను 15 శాతం వడ్డీతో సెబీకి రిఫండ్ చేయాలని ఆదేశించింది. అయితే ఇందులో సంస్థ విఫలం కావడంతో గడువును పెంచింది. దీని ప్రకారం తక్షణం రూ.5,120 కోట్ల తక్షణం చెల్లించాలని, రూ.10,000 కోట్లను జనవరి మొదటి వారంకల్లా చెల్లించాలని, మిగిలిన సొమ్మును ఫిబ్రవరి మొదటివారంలోపు చెల్లించాలని పేర్కొంది. డిసెంబర్ 5న రూ.5,120 కోట్ల డ్రాఫ్ట్‌ను చెల్లించిన సహారా- ఆపై మొత్తాల చెల్లింపుల్లో విఫలమయ్యింది. కోర్టులో సెబీ ధిక్కరణ పిటిషన్లను ఎదుర్కొంటోంది.