పెద్ద నోట్ల రద్దుపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది. దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి సూచించింది.
ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్యుడు ఇబ్బంది పడకూడదని, బ్యాంకుల్లో రద్దీ తగ్గించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని వివరణ కోరింది. నోట్ల రద్దు వల్ల నల్లకుబేరులకు తీవ్ర నష్టం వాటిల్లిందని అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలియజేశారు. బ్లాక్‌మనీపై కేంద్రం సర్జికల్ దాడులు చేసిందని చెప్పారు. అటార్నీ జనరల్ వాదనలతో సుప్రీం కోర్టు ఏకీభవించింది.