
అలా అయితే గవర్నర్ ఎందుకు?
చంద్రబాబు అత్యంత హీనమైన అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు.
న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత హీనమైన అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కేబినెట్ లో చేర్చుకుని ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి చంద్రబాబు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. గవర్నర్ నరసింహన్ వైఖరి రాజ్యాంగవిరుద్ధంగా ఉందని మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సీఎం ఇచ్చిన సలహాకు గవర్నర్ అభ్యంతరం చెప్పాల్సిందన్నారు. చెప్పినట్టు చేసేందుకైతే గవర్నర్ ఎందుకు.. మిషన్ అయితే చాలని చురక అంటించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను గెలిపించుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని, అందుకే రాజీనామాలు చేయించడం లేదని ఎద్దేవా చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని సవరించాల్సిన అవసరముందని సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.