
సోనియాపై సుష్మా ప్రశంసల జల్లు
హుందా మనిషి అని కితాబు
సుష్మా గొంతు మిఠాయికంటే మధురమన్న షిండే
అద్వానీని పొగిడిన సుష్మా.. కన్నీటిపర్యంతమైన అద్వానీ
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో నిత్యం విమర్శలు, ఎద్దేవాల్లో మునిగితే లిన అధికార, ప్రతిపక్షాలు పర స్పరం ప్రశంసల వర్షం కురిపించుకున్నాయి! శుక్రవారం లోక్‌సభ చివరి సమావేశాల్లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. సోనియా గాంధీ దేశానికి ప్రధాని అయితే గుండు గీయించుకుంటానని ఒకప్పుడు శపథం చేసిన బీజేపీ నేత, సభలో ప్రతిపక్షనాయకురాలు సుష్మా స్వరాజ్ ఆ విషయం పక్కన పెట్టి కాంగ్రెస్ అధ్యక్షురాలిపై పొగడ్తలు కురిపించారు. సోనియా హుందా నేత అని కొనియాడారు. స్వపక్ష నేత అద్వానీనీ ప్రశంసలతో ముంచెత్తుతూ.. ఆయనది ‘న్యాయ్ ప్రియతా’(న్యాయ సంధత) మార్గమన్నా రు. దీంతో అద్వానీ ఉద్వేగం తట్టుకోలేక కన్నీటిపర్యంతమయ్యారు.
సుష్మా ఏమన్నారంటే..
సోనియా హుందాతనం, ప్రధా ని మృదుత్వం 15వ లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగడానికి దోహదపడ్డాయి.
పార్లమెంటరీ వ్యవహారాల మం త్రి కమల్‌నాథ్ షరారత్(కొంటె తనం) ప్రయత్నాలు చేయగా, సభా నేత షిండే షరాఫత్(మంచితనం) ప్రదర్శించారు.(దీంతో సభలో చప్పట్లు మోగాయి)
ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను మాతో తీసుకెళ్తున్నాం. 15వ లోక్‌సభ చరిత్రను రాసినప్పుడు ఎక్కువ కాలం అవాంతరాలతో నడిచినా పెండింగ్‌లోని చాలా బిల్లులు పాసయ్యాయన్న సంగతీ నమోదవుతుంది.
మేం విపక్ష సభ్యులమే కానీ, శత్రువులం కాము. ఎంత ఘాటుగా విమర్శించినా అది వ్యక్తిగతం కాదు. సభా మర్యాదలకు అనుగుణంగా నడుచుకోవాలని అద్వానీ నాకెప్పుడూ సూచిస్తుంటారు. మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా.
బీజేపీ టీ బిల్లుకు మద్దతిస్తుందనుకోలేదు: షిండే
‘తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతిస్తుందన్న విషయంలో నాకు మొద ట్లో నమ్మకం లేదు. అయితే పదేళ్ల కిందట సోనియా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఏర్పాటు చేసే అంశంలో మీరు(బీజేపీ) ప్రతిష్ట కోసం పాకులాడలేదు. మీరూ తెలంగాణ ఇస్తామని గతంలో ప్రకటిం చారు’ అని షిండే అన్నారు. ప్రత్యేకించి సుష్మాను ఉద్దేశిస్తూ.. ‘మీ గొంతు చాలా తియ్యగా ఉంటుంది.. మిఠాయికంటే తీయగా ఉం టుంది’ అని అన్నారు. టీ బిల్లుకు మద్దతు విషయంలో సుష్మా తీరు అభినందనీయమన్నారు. ఇతర విపక్షాలనూ పొగిడారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే ప్రయోగించిన అంశాన్ని గుర్తుచేస్తూ.. సభలో తోపులాటలు, నెట్టుకోవడాలు చూసినప్పుడు భయమేసిందని అన్నారు. ఈ సమయంలో ఇతర సభ్యులు జోక్యం చేసుకుని.. హోం మంత్రి దేనికీ భయపడకూడదన్నారు. బాధ్యత తీసుకోవడానికి ఎప్పుడూ భయపడనని షిండే అన్నారు.