సిరియాపై దాడికి అమెరికా సిద్ధం.. సిరియాకు రష్యా దన్ను
సిరియాపై దాడి చేయడానికి అమెరికా శరవేగంగా అడుగులు వేస్తోంది. పదాతి దళాలను పంపకుండా కేవలం వాయుమార్గంలోనే ప్రస్తుతానికి దాడిని సరిపెడతామంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చాలా 'ఉదారంగా' ప్రకటించారు. ఈలోపు అమెరికాకు ఆగర్భశత్రువైన రష్యా.. సిరియాకు దన్నుగా నిలిచింది. సిరియాలోని అసద్ సర్కారు రసాయన ఆయుధాలను ఉపయోగించడం వాస్తవం కాదని తెలిపింది.
సిరియన్ గడ్డమీద అమెరికన్ సైనికుల పదఘట్టనలు ఉండబోవని, సుదీర్ఘ కాలం కాకుండా పరిమితంగా చర్య చేపడతామని ఒబామా వాషింగ్టన్లో ప్రకటించారు. అయితే, అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అమెరికా ఏం చేసినా, అది మరీపెద్ద చర్య మాత్రం కాబోదన్నారు. మిత్ర దేశాలను, అమెరికన్ కాంగ్రెస్ను కూడా తాము సంప్రదించామని చెప్పారు. తద్వారా దాడి తప్పదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.
అమెరికా ఇలాంటి ప్రకటన చేయడంతో రష్యా వెంటనే స్పందించింది. బషర్ అల్ అసద్ ప్రభుత్వమే రసాయన దాడులకు పాల్పడిందనడానికి సాక్ష్యాలు అమెరికా దగ్గరుంటే, వాటిని ఐక్యరాజ్య సమితికి సమర్పించాలని సవాలు చేశారు. ఆ దాడులకు వారిని బాధ్యులను చేయడం తగదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెచ్చగొడితే, ఇతర దేశాలను కూడా ఈ వ్యవహారంలోకి లాగినట్లే అవుతుందని పుతిన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కాదని ఏకపక్షంగా దాడి చేస్తే అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అవుతుందని అమెరికాను పుతిన్ హెచ్చరించారు.