ఒక్కరోజు ముందే అమెరికాకు రష్యా వార్నింగ్
న్యూయార్క్: సిరియా విషయంలో అగ్రరాజ్యాలు అమెరికా, రష్యాలు అనుసరిస్తున్న వైఖరి ఇరు దేశాల మధ్య చిచ్చు రాజేస్తోంది. సిరియాలో అమెరికా సైనిక దాడులు జరిపితే ప్రతీకార చర్యలు తప్పవని రష్యా హెచ్చరించింది. గురువారం రష్యా రాయబారి వ్లాదిమిర్ సఫ్రోన్‌కోవ్ ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇరాక్, లిబియా దేశాల విషయంలో అమెరికా అనుసరించిన వైఖరిని ఆయన ప్రస్తావించారు.
తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై సిరియా వైమానిక దళం పాల్పడిన రసాయన దాడుల్లో 70 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఏం జరుగుతుందో చూడండి అంటూ సిరియాను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యా రాయబారి ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. సిరియా విషయంలో అమెరికా జోక్యం చేసుకోరాదని హెచ్చరించారు.
కాగా మరుసటి రోజే భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రష్యా హెచ్చరికలను బేఖాతారు చేస్తూ అమెరికా సిరియాలో క్షిపణి దాడులు ప్రారంభించింది. షైరత్ వైమానిక స్థావరంపై సుమారు 60 వరకు తోమహాక్ క్షిపణులను ప్రయోగించింది. సిరియా అధ్యక్షుడు అసద్ రసాయన దాడులకు ప్రతీకారంగానే క్షిపణి దాడి చేసినట్లు అమెరికా చెబుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా ఎలా స్పందిస్తుందో?