కిందపడి ధ్వంసమైన తాజ్‌మహల్ షాండ్లియర్
ఆగ్రా: తాజ్‌మహల్‌కు లార్డ్ కర్జన్ 110 ఏళ్ల క్రితం ఇచ్చిన షాండ్లియర్ ఒకటి కిందపడి ధ్వంసమైంది. దీనిపై భారత పురాతన పరిశోధన విభాగం(ఏఎస్‌ఐ) విచారణకు ఆదేశించింది. తాజ్‌మహల్ రాయల్ గేట్‌లోని ఆరడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, 60కేజీల బరువైన రాగి షాండ్లియర్‌ను 1905లో బిగించగా బుధవారం అది కిందపడి ధ్వంసమైందని ఆగ్రా ఏఎస్‌ఐ చీఫ్ భువన్ విక్రమ్ శనివారం తెలిపారు. షాండ్లియర్ మళ్లీ పనికొస్తుందో లేదో తేలుస్తామన్నారు.
శిథిలావస్థకు చేరడంతో కిందపడిందని భావిస్తున్నారు. అది కిందపడినపుడు అక్కడెవరూ లేరు. తాజ్‌ను రాత్రి వేళల్లో సందర్శించే పర్యాటకుల కోసం ఈ-టికెట్‌లను జారీచేయాలని భావిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్‌కు బదులుగా మధ్యాహ్నం 3 గంటలలోపు ఈ-టికెట్లను కొనుగోలు చేయొచ్చని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ తెలిపారు. రాత్రి గం.8.30 నుంచి గం.12.30మధ్య సందర్శకులను లోపలికి అనుమతిస్తారు.