మంత్రి తలసానిపై చర్య తీసుకోండి
గవర్నర్‌కు టీ టీడీపీ నేతల ఫిర్యాదు రాజ్‌భవన్ ఎదుట ధర్నా.. అరెస్టు
హైదరాబాద్: రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవిలో కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని టీటీడీపీ నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ తరపున గెలిచిన తలసాని తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పి మోసం చేశారని, ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.
అయితే, ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కోర్టులో ఉన్నందున తానేమీ స్పందించలేనని గవర్నర్ టీటీడీపీ నాయకులతో అన్నట్టు తెలిసింది. గవర్నర్‌ను కలసిన వారిలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, మాగంటి గోపీనాథ్ తదితరులు ఉన్నారు. గవర్నర్‌ను కలసిన అనంతరం టీటీడీపీ నాయకులు రాజ్‌భవన్ ఎదుట బైఠాయించారు. తలసానిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంత నచ్చజెప్పినా వారు వినకపోవడంతో పోలీసులు మొత్తం 13 మందిని అరెస్టు చేసి పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.