- అన్నీ ఒప్పుకున్నా మళ్లీ తిరగదోడతారా...
- తెలంగాణ ప్రభుత్వ తీరు బాగోలేదు
- గవర్నర్ వద్ద వాపోయిన ఏపీ సీఎం?
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విషయమై చర్చించేందుకే తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారా...? అంటే అవుననే అంటున్నాయి టీడీపీ, అధికారవర్గాలు. గవర్నర్ నరసింహన్‌తో చంద్రబాబు ఏకాంతంగా గంటపాటు చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవలే ముగిసిన అసెంబ్లీ సమావేశాల తీరు గురించి చంద్రబాబు కొద్దిసేపు వివరించినట్లు సమాచారం. ఆ తరువాత సుదీర్ఘంగా ఓటుకు కోట్లు మీదే చర్చించినట్లు తెలిసింది. గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించడం, దాంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం తెలిసిందే.
ఓటుకు కోట్లు కేసు 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగులోకి వచ్చింది. టీటీడీపీ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెలే స్టీఫెన్‌సన్‌కు లంచమిస్తూ వీడియో టేపుల్లో పట్టుబడ్డారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలు జూన్ ఏడో తేదీ వెలుగులోకి వచ్చాయి. ఈ నేపధ్యంలో తన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైందని భావించిన చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాజీ చేసుకుని హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా ఉండవల్లికి మకాం మార్చారన్న ఆరోపణలున్నాయి. గవర్నర్‌తో భేటీ సందర్భంగా ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం.
అనధికార అవగాహనను పట్టించుకోవడం లేదు...
లోపాయికారిగా జరిగిన ఒప్పందం మేరకు తాను కేసు నుంచి బైటపడేందుకు గాను ఉమ్మడి రాజధానిని వీడి వెళ్లిపోయినా మళ్లీ ఆ కేసును తెలంగాణ ప్రభుత్వం తిరగతోడుతుందని గవర్నర్ వద్ద చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో తాను ఇక ముందు ఉండనని, అతిధిగా, టీడీపీ జాతీయాధ్యక్షుడిగా అపుడపుడూ వచ్చి వెళుతుంటానని కూడా తాను వెల్లడించానని, తన వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవని గవర్నర్ వద్ద స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ కేసు వెలుగులోకి వచ్చినపుడు రెండు రాష్ట్రాల మధ్య అనధికారికంగా కుదుర్చుకున్న అవగాహనను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవటం లేదనటానికి తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే ఉదాహరణ అని కూడా గవర్నర్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనపై ఓ ఎమ్మెల్యే కేసు వేసేంత వరకూ సీఎం లేదా గవర్నర్‌కు తెలియదని తాను అనుకోవటం లేదని, ఇది కావాలని చేస్తున్నట్లుగా తాను భావిస్తున్నానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు వాదనను గవర్నర్ తోసిపుచ్చినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
మీరు మీ నిఘా విభాగం అధికారులను ఈ కేస ు విషయమై సమాచారం కనుక్కొవటంలో వైఫల్యం చెందటంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రికల్లో వార్తలు చదివాను, కేసుపై కోర్టు తీర్పు వెలువడిన వెంటనే వాస్తవాలు తెలుసుకునేందుకు స్వయంగా నేను తెలంగాణ సీఎంతో పాటు ఏసీబీ డెరైక్టర్ జనరల్, అడ్వకేట్ జనరల్‌తో కూడా మాట్లాడాను, మీరు అనవసరంగా అపోహలు పెట్టుకోవద్దని చంద్రబాబుకు గవర్నర్ స్పష్టం చేసినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఈ కేసుకు సంబంధించిన సరైన సమాచారం సరైన సమయంలో ఇవ్వలేదనే కారణంతోనే ఓ పోలీస్ ఉన్నతాధికారిని తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిన అంశం కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు టీడీపీ వర్గాల సమాచారం. తాజా పరిణామాల నేపధ్యంలో ఓటుకు కోట్లు కేసు అంశాన్ని తాను త్వరలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకెళతానని గవర్నర్‌కు చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
‘ఓటుకు కోట్లు’పై బాబు కినుక
Published Wed, Sep 14 2016 1:31 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement