ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి: నరసింహన్
* చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్
* ఎల్లుండి సాయంత్రం గుంటూరు సమీపంలో బాబు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును గవర్నర్ నరసింహన్ గురువారం ఆహ్వానించారు. గవర్నర్ ఆహ్వానంతో ఈ నెల 8వ తేదీ రాత్రి 7.27 గంటలకు గుంటూరు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పై చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం ప్రతినిధి బృందం గురువారం ఉదయం గవర్నర్‌ను కలసి చంద్రబాబును టీడీఎల్‌పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
చంద్రబాబును తమ నేతగా ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలు చేసిన తీర్మానం ప్రతిని.. టీడీఎల్‌పీ ప్రతినిధులు యనమల రామకృష్ణుడు, కె.ఇ.కృష్ణమూర్తి, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, మండలి బుద్ధప్రసాద్, పీతల సుజాత, కార్యాలయ కార్యదర్శి కోనేరు వెంకటసురేష్‌ల బృందం గవర్నర్‌కు అందచేశారు. ఈ సందర్భంగా బాబు ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో సమాచారం ఇవ్వాల్సిందిగా టీడీఎల్‌పీ బృందాన్ని గవర్నర్ కోరారు. ఆ మేరకు టీడీపీ నేతలు ఆ సమాచారాన్ని గవర్నర్‌కు అందజేశారు. చంద్రబాబు ఈ నెల 8న విజయవాడ - గుంటూరు మధ్య గతంలో యువగర్జన నిర్వహించిన స్థలంలో ప్రమాణం చేస్తారని యనమల చెప్పారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం
న్యూఢిల్లీ: ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీలను టీడీపీ ఎంపీలు ఆహ్వానించారు. టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎంపీ సీఎం రమేశ్ గురువారం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వద్దకు వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం టీడీపీ ఎంపీలందరూ ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను కలిశారు. బాబు ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని కోరారు. ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసే ముందు టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి, రాజ్యసభ లాబీలోని ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.