
సాక్షి, విజయవాడ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పై ప్రభుత్వ విప్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఉంటున్నది రాజ్‌భవనా లేక బీజేపీ భవనా అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్, రాజ్‌భవన్‌పై ఏపీ ప్రజలకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బుద్ధా వెంకన్న మంగళవారం విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ రాజకీయాలకు అతీతంగా పని చేయాలి తప్ప, రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గవర్నర్ బంగ్లా నుండే ప్రారంభమయిందని అన్నారు. బీజేపీ నేతలు గవర్నర్ బంగ్లాని చూసి రెచ్చిపోతున్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా బుద్ధా వెంకన్న విరుచుకుపడ్డారు. కన్నా అవినీతి గురించి మాట్లాడటం చూస్తే దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీకి చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీజేపీ నాయకులు నీచ రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.