బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ(పాత చిత్రం)
అమరావతి: ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాకట్టుపెట్టారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏనాడైనా అమరావతికి చంద్రబాబు దండం పెట్టారా? ఫొటోలో పోజుల కోసం పార్లమెంటుకు మొక్కుతారా అని చంద్రబాబునుద్దేశించి దుయ్యబట్టారు. ఢిల్లీలో చంద్రబాబును కలవడానికి ఎవరు ముందుకు రాలేదని తెలిపారు. ఢిల్లీ వెళ్లి హేమమాలినిని కలిసి వస్తావా.. ఏపీ సీఎంగా ఆంధ్రుల పరువు తీశారని ఘాటుగా విమర్శించారు.
చంద్రబాబు నాయుడి లేఖతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని, ఏపీ ప్రయోజనాలు కోసం చంద్రబాబు ఏనాడూ పోరాటం చేయలేదని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అధికారంలోకి రావడానికి అడ్డుగోలు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అవినీతి అసమర్థత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని కప్పిపుచ్చుకొనేందుకే బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నరేంద్ర మోదీపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడం తప్ప రాష్ట్రానికి ఏమి చేశారని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో జల్సా చేస్తున్నారని, ప్రజలు కట్టిన పన్నులు టీడీపీ కార్యకర్తలు పంచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని, హోదాకు బదులు ప్యాకేజీ ఒప్పుకుంది చంద్రబాబేనని స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని వ్యాఖ్యానించిందీ, ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో అభినందన తీర్మానం చేసింది కూడా చంద్రబాబేనని చెప్పారు.
చంద్రబాబు తన హెరిటేజ్ సంస్థను ఎందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకురాలేదని ప్రశ్నించారు. బీజేపీని ముంచాలని చూస్తూ చంద్రబాబు మునిగిపోతున్నారని.. ఆయన మోసాలను ప్రజలు గమనించాలని విన్నవించారు. రైల్వే జోన్ ఇస్తామని ఎన్నడూ బీజేపీ చెప్పలేదని, ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపింది బీజేపీనేని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణాలను కావాలనే ఆలస్యం చేస్తూ.. తన తప్పులను బీజేపీపై రుద్దాలని బాబు భావిస్తున్నారని చెప్పారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని, పారిపోయి వచ్చి కట్టుబట్టలతో పంపారని అబద్దాలు చెబుతున్నారని వెల్లడించారు. అమెరికాలో కూడా లేని రేట్లతో తాత్కాలిక భవనాలకు కోసం ఖర్చు చేస్తున్నారని, తాత్కాలిక భవనాలు కడుతున్న సీఎంను ప్రజలు తాత్కాలిక సీఎంగానే చూస్తున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment