సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆది నుంచీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఆది లాబాద్ జిల్లాలో ప్రస్తుతం పార్టీకి గడ్డుకాలం దాపురించింది. 2010 ఉప ఎన్నికల తర్వాత జిల్లాలో పార్టీ రోజురోజుకూ పతనం అంచుకు చేరుతోంది. ‘తెలంగాణ’పై అధినేత చంద్రబాబు నాయుడు రెండుకళ్ల సిద్ధాంతం అవలంబించడం.. సమైక్యాంధ్ర కోసం రాష్ట్రపతిని కలిసిన ఆ పార్టీ సీమాంధ్ర నేతలపై చర్యల కోసం స్పందించకపోవడం.. వెరసి జిల్లా ‘తమ్ముళ్లు’ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కావాలంటూ ఇప్పటికే జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, జిల్లా మాజీ అధ్యక్షుడు సహా పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జీలు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం పలువురు సీనియర్లు, కీలక నేతలు కూడా పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతుండడం చర్చనీయాంశమైంది.
కాం గ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలతో మంతనాలు జరపడం మరింత ఆసక్తిని పెంచింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించని బాబు నిర్ణయాలు చివరకు సీమాంధ్ర నేతలకే మద్దతు పలికేలా ఉండటంతో జిల్లా నాయకులు పార్టీలో కొనసాగడమా? బయటకు వెళ్లటమా? అన్న మీమాంసలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 11, 12 తేదీల్లో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర నాయకులతో హైదరాబాద్‌లో అధినేత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సంబంధిత నాయకులు, ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యాలయం నుంచి ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
‘తమ్ముళ్ల’ను కలచివేస్తున్న లేఖల దుమారం..
తెలంగాణ టీడీపీ నేతలు మొదటి నుంచీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు వైఖరితో ఆందోళనకు గురవుతున్నారు. అధినేత కేంద్రానికి రాసిన లేఖలు పలుమార్లు వివాదాస్పదం కాగా.. తాజాగా సీమాంధ్ర నేతలు పయ్యాపుల కేశవ్ తదితరులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని లేఖ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో బాబు స్పందించకపోవడంపై తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలను తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో ప్రణబ్ కమిటీకి లేఖ ఇచ్చానని చెప్పిన బాబును తెలంగాణ టీడీపీ నేతలు వేయినోళ్ల కొనియాడారు.
అయితే 2009 డిసెంబర్ 9న కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసిన మరుసటి రోజే చంద్రబాబు ఏకపక్షంగా రాజీనామా చేశారు. డిసెంబర్ 10 కల్లా పార్టీలకతీతంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలతో రాజీనామాలు ఇప్పించారు. 2013 జూలై 31 సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రకటన చేయగానే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసే అధికారం కాంగ్రెస్‌కు ఎవరిచ్చారంటూ గగ్గోలు పెట్టడం.. రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమైక్యం కోసం లేఖ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచీ తెలంగాణపై బాబు విముఖంగా ఉండగా, ఇంతకాలం అనేక అవమానాలను భ రించిన పార్టీ సీనియర్లు ఇప్పుడు పార్టీని వీడే యోచన చేస్తుండటం క్యాడర్‌ను అయోమయంలో పడేసింది.
అంతర్మథనంలో జిల్లా నేతలు..
ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలా ఉన్న జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్లుగా కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు, నేతలు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పార్టీలో సమైక్యవాదులు, సమైక్యాంధ్ర ఉద్యమాలకే అధినేత పెద్దపీట వేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సమైక్యాంధ్ర ఎంపీల రాజీనా(డ్రా)మాలు.. తాజాగా రాష్ట్రపతికి సీమాంధ్ర నాయకుల లేఖలు తీవ్రమనస్థాపానికి గురిచేసినట్లు ఇప్పటికే టీటీడీపీ నేతలు ప్రకటించారు. చంద్రబాబు వైఖరితో ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో పార్టీ అంపశయ్యపైకి చేరగా.. చూసి చూసి తమ రాజకీయ భవిష్యత్‌ను సమాధి చేసుకోలేమని పలువురు నేతలు బహిరంగంగానే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీడీపీ నేతలతో పాటు జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులతో 11, 12 తేదీల్లో హైదరాబాద్‌లో చంద్రబాబు భేటీ కానుండటం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నట్లు తెలిసింది.