తేజ్పాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పనాజీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించింది. కటకటాల్లో ఉన్న తేజ్పాల్ బెయిల్ పిటిషన్ ను బుధవారం నాడు గోవా కోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తేజ్ పాల్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించిది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి 45 రోజుల పాటు ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు.
గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది.