సాక్షి, గోవా: తెహల్కా మ్యాగజిన్ మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు గోవా కోర్టు షాక్ ఇచ్చింది. తోటి మహిళా జర్నలిస్ట్‌పై అత్యాచారం జరిపినట్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న తేజ్‌పాల్‌పై గోవా కోర్టు అభియోగాలను ఖరారు చేసింది. ఈ కేసులో బుధవారం కోర్టుకు హాజరైన తేజ్‌పాల్ .. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని, విచారణపై స్టే విధించాలని తేజ్‌పాల్ కోరారు. అయితే, ఆయనపై ప్రాసిక్యూషన్ నమోదుచేసిన అభియోగాలను ఖరారు చేసిన కోర్టు.. విచారణను కొనసాగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బగా మారాయి.
గతంలో తేజ్‌పాల్ ఈ కేసు విచారణపై స్టే విధించాలని బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కానీ కోర్టు నిరాకరించింది. 2013 నవంబర్‌లో గోవాలో జరిపిన పార్టీలో తేజ్‌పాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తెహల్కా ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ తేజ్‌పాల్ మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేశారు. బీజేపీ ప్రభుత్వం తనపై కావాలనే కక్షపూరిత చర్యలకు పాల్పడుతొందన్నారు.