బీజేపీ నేత జాత్యహంకార వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత దేశంలో జాతివివక్ష లేదంటూ బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. దక్షిణ భారతీయులపై జాత్యహంకార వ్యాఖలు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు నైజీరియా విద్యార్థులపై నోయిడాలో జరిగిన దాడిపై 'ఆల్ జజీరా' చానల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
'భారతీయులను జాత్యహంకారులు అనడం దుర్మార్గం. ఎందుకంటే మేము నల్లవాడైన కృష్ణుడిని పూజిస్తాం. మాకే కనుక జాతివివక్ష ఉంటే దక్షిణ భారతీయులతో కలిసి ఎలా నివసిస్తాం. మాలోనూ, మన చుట్టూ నల్లజాతీయులు ఉన్నారు. వివిధ వర్గాలకు చెందినప్పటికీ భారతీయులు పరస్పరం సంఘర్షించుకుంటారు. కొంతకాలం క్రితం మహారాష్ట్రలో బిహారీలపై దాడులు జరిగాయి. మరాఠీలను బిహార్ లో బెదిరించారు. ఇవన్నీ జాత్యహంకార దాడులు కాద'ని తరుణ్ విజయ్ పేర్కొన్నారు.
ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రేగుతున్నాయి. భారత్ అంటే ఉత్తరాది ఒకటే అని ఆయన భావిస్తున్నారని, దక్షిణాది వారితో తమకు ఎటువంటి సమస్యలు లేవని నెటిజన్లు కామెంట్లు పెట్టారు.