
టాటా సన్స్ ఛైర్మన్ ఎంపిక
ముంబై: టాటా- మిస్త్రీ బోర్డ్ వార్ అనంతరం కీలక పరిణామం చేసుకుంది. టాటా సన్స్ బోర్డ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం గురువారం టాటా సన్స్ బోర్డ్ కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం బోర్డ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీసీఎస్ చీఫ్ నటరాజన్ చంద్రశేఖరన్ ను టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా ఎంపిక చేశారు. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 21 నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే దీనిపై టాటా గ్రూపు అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ కొత్త చీఫ్ గా రాజేష్ గోపీనాథ్ ఎంపిక ఖాయమైనట్టు తెలుస్తోంది.
టాటా సన్స్ మధ్యంతర ఛైర్మన్ రతన్ టాటా, టీవీఎస్ గ్రూపు చైర్మన్ వేణు శ్రీనివాసన్, బైన్ కేపిటల్ అమిత్ చంద్ర, రోనన్ సేన్ ,లార్డ్ కుమార్ భట్టాచార్యలతో కూడిన ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ సమావేశంలో కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ బాస్ ను ఏకగ్రీవంగా ఆమోదించారు.
అయితే ఎన్. చంద్రశేఖరన్ టాటా సన్స్ కొత్త ఛైర్మన్ గా ఎంపిక కానున్నారనే అంచనాలపై పలువురు పారిశ్రామికవేత్తలు, మార్కెట్ నిపుణులు ఇప్పటికే సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణమూర్తి స్పందిస్తూ టాటా సన్స్ చైర్మన్ గా ఆయన సక్సెస్ అవుతారనే దానిపై ఎలాంటి సందేహం లేదన్నారు. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి అని, చంద్రశేఖరన్ ను ఎంపిక చేస్తే ఐటీ రంగానికి మంచిదేనంటూ వ్యాఖ్యానించారు. చంద్రశేఖరన్ ఎంపిక అంచనాలపై మరో ఐటీ మేజర్ విప్రోతోపాటు, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా , టైటన్ ఎండీ భాస్కర్ భట్ కూడా హర్షం వ్యక్తం చేశారు.