పన్ను లేని ‘ఆదా’యాలు.. | Tax-free earnings .. | Sakshi
Sakshi News home page

పన్ను లేని ‘ఆదా’యాలు..

Published Sun, Jun 7 2015 11:52 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

పన్ను లేని ‘ఆదా’యాలు.. - Sakshi

పన్ను లేని ‘ఆదా’యాలు..

జీవితంలో ఏం తప్పినా తప్పకపోయినా... చావు పుట్టుకలు, పన్నులు కట్టడం మాత్రం తప్పదన్నాడో మేధావి. ఆదాయం ఎంత పెరిగితే పన్నుల మోత కూడా అదే రేంజిలో పెరుగుతుందని అంతా భావిస్తుంటారు. కానీ, అసలు పన్నుల గొడవే లేని ఆదాయాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటి గురించి వివరించేదే ఈ కథనం.
 
 వ్యవసాయ ఆదాయం
 మనది ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. అందుకే సాగు రంగాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయంపై వచ్చే ఆదాయానికి పన్ను నుంచి మినహాయింపునిస్తోంది ఆదాయ పన్ను చట్టం.
 
  పొదుపు ఖాతాలపై వడ్డీ ఆదాయం..
 మన పొదుపు ఖాతాలపై వడ్డీ ఆదాయం ఏడాదికి రూ.10,000 దాకా ఉంటే దానిపై ఎలాంటి పన్నూ ఉండదు. ఇతర బ్యాంకుల్లో ఉండే ఖాతాలన్నింటిపై వచ్చే వడ్డీ ఆదాయం కూడా దీన్లో భాగమవుతుంది. ఉదాహరణకు ఒక బ్యాంకులోని పొదుపు ఖాతాపై రూ.10,000 మరో బ్యాంకులోని సేవింగ్స్ అకౌంటుపై ఇంకో రూ.10,000 వడ్డీ ఆదాయం వచ్చిందనుకోండి. అప్పుడు మీకు నికరంగా రూ.20,000 వడ్డీ ఆదాయం వచ్చినట్లవుతుంది. ఇందులో రూ.10,000 పరిమితి పోను మిగతాది పన్ను పరిధిలోకి వస్తుంది.
 
 దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్..
  షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను దీర్ఘకాలం పాటు అట్టే పెట్టుకున్న తర్వాత విక్రయిస్తే వాటిపై వచ్చే లాభాలపై పన్నులుండవు. ఇక్కడ దీర్ఘకాలమంటే కనీసం ఏడాది. ఏడాది పాటైనా సదరు షేర్లను, ఈక్విటీ ఫండ్ యూనిట్‌ను విక్రయించకుండా ఉండాలి. అయితే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఇది వర్తించదు.
 
   విదేశీ సర్వీసులకు మినహాయింపు
 భారతీయులు విదేశాల్లో సర్వీసులు అందిస్తూ వాటికి సంబంధించి అలవెన్సులు మొదలైనవి ఆ దేశంలోనే అందుకుంటున్న పక్షంలో ఆదాయ పన్ను చట్టంలోని 10(7) సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీనివల్లే ప్రభుత్వ ఉద్యోగులు విదేశాల్లో సేవలు అందిస్తున్నప్పుడు అక్కడ అందుకునే అలవెన్సులపై పన్నుల బెడద ఉండదు.
 
 హిందూ అవిభక్త కుటుంబాల ఆదాయం..
  హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)లో సభ్యులుగా అందుకునే ఆదాయం లేదా వారసత్వంగా వచ్చే డబ్బుపై ఆదాయ పన్ను పడదు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10 (2) కింద ఈ మినహాయింపు లభిస్తుంది.
 
భాగస్వామ్య సంస్థలో షేర్లు ..
 మీరేదైనా పార్ట్‌నర్‌షిప్ సంస్థలో భాగస్వామిగా ఉన్న పక్షంలో కంపెనీకి వచ్చే మొత్తం ఆదాయంలో మీకొచ్చే వాటాపై ఆదాయ పన్ను ఉండదు. అయితే, లాభాల్లో వాటాలు కాకుండా.. ఇతరత్రా రెమ్యూనరేషన్, వడ్డీ మొదలైనవి మాత్రం పన్ను పరిధిలోకి వచ్చేస్తాయి.
 
  గ్రాట్యుటీ ఆదాయం
 సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఉద్యోగుల సేవలను గుర్తించి, కంపెనీలు ప్రత్యేకంగా ఇచ్చేది గ్రాట్యుటీ. ప్రభుత్వ ఉద్యోగులు అందుకునే గ్రాట్యుటీకి ఆదాయ పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. అలా కాకుండా గ్రాట్యుటీ చట్టం 1972 పరిధిలోకి వచ్చే ఇతరత్రా ఉద్యోగుల విషయంలో ఈ కింది మూడింటిలో ఏది తక్కువైతే దానికి మినహాయింపు లభిస్తుంది. ఎ) ప్రతి ఏడాది ఆఖరున అందుకున్న జీతం ఆధారంగా 15 రోజుల వేతనం. బి) రూ. 10,00,000. సి) అందుకున్న మొత్తం గ్రాట్యుటీ. ఒకవేళ రిటైర్మెంట్ సందర్భంగా అందుకున్నది, రిటైర్మెంట్ కన్నా ముందే పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు అందుకునే గ్రాట్యుటీ, ఉద్యోగి మరణించిన పక్షంలో వారిపై ఆధారపడిన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులకు ఇచ్చే గ్రాట్యుటీపైన పన్ను ఉండదు.
 
   స్కాలర్‌షిప్‌లు, అవార్డులు..
 విద్య ఖర్చుల కోసం అర్హులైన విద్యార్థులు అందుకునే స్కాలర్‌షిప్ లేదా అవార్డుల్లాంటివి పన్ను పరిధిలోకి రావు. దీనికి గరిష్ట పరిమితంటూ ఏమీ లేదు. స్కాలర్‌షిప్ కింద ఎంత వచ్చినా పన్ను మినహాయింపు లభిస్తుంది.
 
   స్వచ్ఛంద పదవీ విరమణ మొత్తం..
 ఆదాయ పన్ను(ఐటీ చట్టం నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) స్కీమును ఎంచుకోవడం ద్వారా ఉద్యోగి అందుకునే అమౌంటుపై పన్నులు ఉండవు. గరిష్టంగా రూ. 5 లక్షల దాకా మొత్తానికి ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement