చిత్రం విచిత్రం టిడిపి!
న్యూఢిల్లీ: ఈరోజు రాజ్యసభలో టిడిపి సభ్యులు చిత్రవిచిత్రంగా ప్రవర్తించారు. రాజ్యసభ సాక్షిగా టిడిపి బండారం బయటపడింది. ఒకరు రాష్ట్ర విభజన వద్దంటే, మరొకరు కావాలని కోరారు. అలాగే అరిచారు. నినదించారు. ఒకరు బిల్లు రాజ్యాంగ విరుద్దం అంటే, మరొకరు మద్దతు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ జరిగేటప్పుడు కూడా అదే పరిస్థితి. ఒక సభ్యురాలు బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతుంటే, మరో సభ్యుడు సమైక్యాంధ్ర అని ప్లకార్డు పట్టుకున్నారు.
చర్చ జరిగే సమయంలో టిడిపి సభ్యుడు సిఎం రమేష్ మాట్లాడుతూ బిల్లు రాజ్యంగ విరుద్దం - వ్యతిరేకిస్తున్నాం అని రెండు ముక్కల్లో ముగించారు. సుజనా చౌదరి మాట్లాడుతూ తమ పార్టీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే విభజనకు అనుసరించిన విధానినికి వ్యతిరేకం అన్నారు. లోక్సభలో అడ్డగోలుగా బిల్లును నెగ్గించారన్నారు. 2004లోనే రాష్ట్రాన్ని ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పెట్టిన వారు విభజనను ఎందుకు ఆపారని అడిగారు. రాజ్యంగబద్దంగా విభజన చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని, అయితే అది సీమాంధ్రకు భారం కాకూడదని చెప్పారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరారు.
ఆ పార్టీకే చెందిన మరో సభ్యుడు దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ బిల్లును సమర్ధించారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తెలంగాణకు అనుకూలం అని చెప్పారు. కోట్లాది ప్రజల ఆకాంక్ష తెలంగాణ అని ఆయన చెప్పారు. అమర వీరులకు జోహార్లు అర్పించారు. ఆ పార్టీకే చెందిన మరో సభ్యురాలు గుండు సుధారాణి కూడా బిల్లును సమర్ధిస్తున్నామని చెప్పారు. స్థానిక ప్రాతిపదికగానే ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలని కోరారు.