టీటీడీపీ కథ కంచికి | tdp marger in trs waiting for speaker decision | Sakshi
Sakshi News home page

టీటీడీపీ కథ కంచికి

Published Thu, Mar 10 2016 3:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీటీడీపీ కథ కంచికి - Sakshi

టీటీడీపీ కథ కంచికి

రేపు ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి..
విలీనంపై స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూపులు
అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై టీడీపీ నేతల భేటీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ కథ కంచికి చేరిన ట్లే కనిపిస్తోంది. కొత్త రాష్ట్రం తెలంగాణకు జరిగిన తొలి ఎన్నికల్లో(2014) పదిహేను మంది ఎమ్మెల్యేలతో మొదలైన తెలుగుదేశం పార్టీ ప్రస్థానం 20 నెలలు గడిచేసరికి ముచ్చటగా మూడుకు పడిపోయింది. ఒకరి వెనుక ఒకరుగా అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి టీటీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టడంతో ఆ పార్టీ చిక్కిశల్యమైపోయింది. గురువారం నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలకు ఆ పార్టీ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలతోనే హాజరు కానుంది. టీడీపీఎల్‌పీ నేత రేవంత్‌రెడ్డి, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మిగిలారు.

బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలు బుధవారం టీడీఎల్పీ కార్యాలయంలో చర్చించారు. అధికార పక్షంపై పోరాడడానికి ఎలాంటి ప్రత్యేక వ్యూహాన్నీ ఖరారు చేయలేదని, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడే నిర్ణయించుకుంటామని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు రేవంత్‌రెడ్డితో సమావేశమై చర్చించి పలు సూచనలు చేశారు. కాగా, గురువారం గవర్నర్ ప్రసంగం ముగిశాక జరగాల్సిన బీఏసీ సమావేశానికి తమకు అనుమతి ఉంటుందా? లేదా అన్న అంశంపైనా టీటీడీపీకి స్పష్టత లేదు.

 స్పీకర్ నిర్ణయం కోసం...
టీటీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి నేతృత్వంలో స్పీకర్‌కు ఓ లేఖ రాశారు. మొత్తం 15 మందిలో మెజారిటీ తమకే ఉందని, విలీనానికి అవసరమైన రెండింట మూడొంతుల మెజారిటీ ఉన్నందున తమను టీఆర్‌ఎస్‌లో వీలీనం చేయాలని ఆ లేఖలో కోరారు. కాగా, తమ చేరిక ఖాయమై సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో తాము కూడా విలీనానికి మద్దతు ఇస్తున్నామని ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీలు ఎర్రబెల్లికి లేఖ ఇచ్చారని తెలిసింది. మొత్తం 12 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఎర్రబెల్లి మరో లేఖను స్పీకర్‌కు అంద జేశారని సమాచారం. ప్రస్తుతం ఈ లేఖ స్పీకర్ పరిశీలనలో ఉంది. టీఆర్‌ఎస్‌లో చేరిన టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తారా? లేదా అని టీడీపీ నాయకత్వం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ ఎల్పీ నేతగా రేవంత్‌ను ఎన్నుకున్నామని స్పీకర్‌కు రాసిన లేఖ కూడా పెండింగులోనే ఉంది. దీంతో ఆయనను ఎల్పీ నేతగా గుర్తిస్తారా? బీఏసీ సమావేశానికి ఆహ్వానిస్తారా? లేదా అన్న ప్రశ్నలు టీడీ పీ నేతల మదిని తొలుస్తున్నాయి. మరోవైపు పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగలడంతో చివరకు అసెంబ్లీ ప్రాంగంణలోని టీడీఎల్పీ కార్యాలయం కూడా టీటీడీపీకి లేకుండా పోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 స్పీకర్‌కు గోపీనాథ్, గాంధీ లేఖ
అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుని, చేరికకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ తమను టీఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ ఎస్ మధుసూదనాచారికి లేఖ రాశారు. సోమ, మంగళవారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన అనంతరం ఈ నెల 11న(శుక్రవారం) టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వీరిద్దరూ స్పీకర్‌కు లేఖ రాయడంతో ఒక విధంగా వారు టీఆర్‌ఎస్‌లో చేరినట్లేనని, ముఖ్యమంత్రి సమక్షంలో అధికారికంగా గులాబీ కండువాలు కప్పుకోవడమే మిగిలిందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరి పార్టీ మార్పు నిర్ణయంతో గ్రేటర్‌లో తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలకుగానూ ఇక ఆర్.కష్ణయ్య(ఎల్‌బీనగర్) ఒక్కరే మిగులుతారు.

టీడీపీ నుంచి గాంధీ, గోపీనాథ్ సస్పెన్షన్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌లను టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. తమను టీఆర్‌ఎస్ సభ్యులుగా గుర్తించాలంటూ బుధవారం స్పీకర్ మధుసూదనాచారికి వీరు లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement