సాక్షి, న్యూఢిల్లీ: గురువారం లోక్‌సభలో టీడీపీ ఎంపీలు అడుగడుగునా కాంగ్రెస్ కంటే తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరించారు. అధినేత డెరైక్షన్‌లో సభలో తన్నుకుని నాటకాన్ని రక్తి కట్టించారు! విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలను ప్రాంతాలవారీగా ఉసిగొల్పి చోద్యం చూసిన చంద్రబాబు.. తాజాగా లోక్‌సభలోనూ అదే వ్యూహాన్ని పునరావృతం చేశారు. తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి అమలు చేశారు. మూడు రోజులుగా హస్తినలోనే మకాం వేసి ‘సమ న్యాయం’ పేరుతో జాతీయ నేతలను కలుస్తున్న బాబు, గురువారం ఉదయమే ఇరు ప్రాంత టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. సభలో విభజన బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నించాలని, వారిపై తెలంగాణ ఎంపీలు ఎదురుదాడికి దిగాలని ‘దిశానిర్దేశం’ చేశారు.
అధినేత డెరైక్షన్ మేరకు లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, ఎన్.శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప ముందుగా వెల్ లోకి దూసుకుపోయారు. టేబుళ్ల అద్దాలను పగలగొట్టి, మైకులు విరిచి ధ్వంసరచనకు తెర తీశారు. చేతికందిన కాగితాలనల్లా చించి విసిరేశారు. ఆ వెంటనే... బిల్లుకు అడ్డు రావొద్దంటూ తెలంగాణ టీడీపీ ఎంపీలు రమేశ్‌రాథోడ్, నామా నాగేశ్వరరావు వారితో వాగ్వాదానికి దిగారు. అది క్రమంగా బాహాబాహీగా పరిణమించింది. ఆ క్రమంలో పక్కనే ఉన్న ఇతర సీమాంధ్ర ఎంపీలపైనా వారు దాడికి దిగడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ంది.
విపక్షాల విస్మయం: సభలో మునుపెన్నడూ జరగని ఘటనలు చోటు చేసుకోవడంతో విపక్షాలన్నీ ఒక్కసారిగా విస్తుపోయాయి. గొడవపడుతున్న సభ్యులను సముదాయించేందుకు శరద్ యాదవ్ తదితరులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సభలో కాంగ్రెస్ ఎంపీలే మార్షల్స్ అవతారమెత్తడం, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు విధ్వంసానికి పాల్పడటం, తెలంగాణ సభ్యులు బాహాబాహీకి దిగడం వంటి పరిణామాలు చూసి విపక్ష సభ్యులు విస్తుపోయారు. విభజన బిల్లును ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ అనుసరించిన ఎత్తుగడకు నోరెళ్లబెట్టారు. కాంగ్రెస్ డబుల్‌గేమ్‌ను ఎండగట్టారు.
అయినా సిగ్గుపడ్డారు.. ఖండించారు: ఎలాగోలా విభజన బిల్లును విజయవంతంగా లోక్‌సభలో ప్రవేశపెట్టామని కాంగ్రెస్ పెద్దలు లోలోపల ఆనందించారు. గురువారం నాటి పరిణామాలకు తమ ఎత్తుగడలే కారణమని తెలిసి కూడా, పైకి మాత్రం వాటిపై విచారం వ్యక్తం చేశారు. స్క్రిప్టుకు కారకుడైన మంత్రి కమల్‌నాథ్‌తో పాటు షిండే తదితరులంతా మీడియా ముందుకొచ్చి వాటిని ఖండించారు. ఎంపీల తీరు సిగ్గుపడేలా ఉందని వ్యాఖ్యానించారు!