
మనిషి తట్టుకోలేనంత వేగం
చైనా వాళ్లింతే.. ఎలుక దూరే కంత దొరికితే చాలు.. దాంట్లోంచే ఏనుగును పంపేందుకు ప్లాన్లు సిద్ధం చేసేస్తారు. పక్కనున్న ఫొటోలో చూశారుగా.. అవే నిదర్శనం. ఏంటివి అంటారా? టెస్లా కార్ల కంపెనీ ఓనర్ ఎలన్ మస్క్ హైపర్‌లూప్ పేరుతో గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలిగే రవాణా వ్యవస్థ ఐడియా తీసుకొచ్చాడు కదా.. దానికి ఇది పోటీ అన్నమాట. వివరాలు చూడండి.. విషయం మీకే అర్థమవుతుంది. దీని పేరు టీ–ఫ్లైట్.
చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ డిజైన్ చేసింది దీన్ని. అయస్కాంతాల సాయంతో గాల్లో కొద్దిగా తేలుకుంటూ వెళ్లే మ్యాగ్‌లెవ్ ట్రెయిన్లు తెలుసుగా.. అవే రైళ్లను గాలి మొత్తం తీసేసిన గొట్టాల్లో పంపితే ఎలా ఉంటుందో టీ–ఫ్లైట్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మ్యాగ్‌లెవ్ రైళ్లు గంటకు 400 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలవు.. టీ–ఫ్లైట్ దీనికి పదిరెట్లు ఎక్కువ స్పీడ్‌తో వెళుతుందని అంటున్నారు చైనా ఇంజినీర్లు. ముందుగా గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తరువాత దశలవారీగా పెంచుతామని వీరు చెబుతున్నారు.
ఇంత వేగంతో వెళ్లినా ఈ రైల్లోని ప్రయాణీకులకు ఆ విషయం పెద్దగా తెలియదని.. విమానం టేకాఫ్ తీసుకునేలా ఉంటుందని అంటున్నారు. పెట్రోలు, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాలను వాడకపోవడం.. వాతావరణ పరిస్థితుల ప్రభావం ఏదీ లేకపోవడం టీ–ఫ్లైట్ ప్రత్యేకతలు. అయితే మనిషి శరీరం ఇంతటి వేగాన్ని తట్టుకునే అవకాశం తక్కువేనని.. గంటకు 4000 కిలోమీటర్ల వేగాన్ని అతితక్కువ సమయం మాత్రమే శరీరం తట్టుకుంటుందని అంటున్నారు బీజింగ్ ట్రాన్స్‌పోర్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఝావ్ జియాన్. చూద్దాం ఒక్కటైతే నిజం.. చైనీయులు అనుకున్నది అనుకున్నట్టుగా టీ–ఫ్లైట్ సిద్ధమైతే మాత్రం.. భూమ్మీద రవాణా అన్నది కొత్త శకంలోకి ప్రవేశించినట్లే అవుతుంది! 4 గంటల్లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లగలగడమంటే మాటలు కాదు కదా!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్