
అదృష్టమంటే ఇదే: మొసలి నోట చిక్కినా..
నీళ్లలో మొసలి నోటికి చిక్కామంటూ ప్రాణాలతో బయటపడటం అంత సులువు కాదు. కానీ ఓ ఆస్ట్రేలియన్ కుర్రాడు మాత్రం మొసలి నోటికి చిక్కినా లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. తన ఎడమచేతిని నోటకరుచుకొని దాడికి సిద్ధపడ్డ మొసలి తలపై గట్టిగా ఒక పంచ్ ఇవ్వడం ద్వారా తప్పించుకున్నాడు.
ఈశాన్య ఆస్ట్రేలియాలోని జాన్‌స్టోన్ నదిలో అర్ధరాత్రి స్నేహితులతో కలిసి 18 ఏళ్ల లీ డీ పౌవ్ ఈత కొడుతున్నాడు. ఈ సందర్భంగా ఆనందంగా కేరింతలు కొడుతున్న సమయంలో ఓ మొసలి అతనిపై దాడి చేసింది. అకస్మాత్తుగా వచ్చి అతని ఎడమ చేతిని నోట కరుచుకుంది. అయినా భయాందోళనకు గురికాని లీ డీ తెలివిగా దాని నెత్తిమీద ఒక్క పిడిగుద్దు విసరడంతో అది చేతిని వదిలిపెట్టింది. ఈ ఘటనలో అతని చేతికి పెద్ద గాయమైంది. అయినప్పటికీ అతను ప్రాణాలతో బయటపడటం చాలా అదృష్టమనే చెప్పాలని అతనికి చికిత్స అందించిన డాక్టర్ నీల్ నోబెల్ తెలిపారు. చేతికి తీవ్ర గాయాలు అవ్వడంతో పలు శస్త్రచికిత్సలు నిర్వహించినట్టు చెప్పారు.