
రాకాసి మొసలి
సిడ్నీ : ఎనిమిదేళ్ల నిరంతర వేట అనంతరం నరమాంస పిపాసి అయిన రాకాసి ఉప్పునీటి మొసలిని ఆస్ట్రేలియా అధికారులు మంగళవారం పట్టుకున్నారు. దాదాపు 4.7 మీటర్లు(15.4 అడుగులు) పొడవున్న భారీ మొసలి 600 కిలోల బరువుంది. దీని వయసు 60 సంవత్సారాలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. క్యాథరిన్ నదిలోని బ్యాక్ వాటర్స్‌లో ఉండే ఈ మొసలి పలుమార్లు స్థానికులపై దాడులు చేసింది.
ఉప్పు నీటి మొసళ్లు సాధారణంగా సైజులో భారీగానే ఉంటాయి. అయితే, క్యాథరిన్ నదిలో ఇప్పటివరకూ దొరికిన మొసళ్లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. గతేడాది ఓ పెద్దావిడపై దాడి చేసిన ఈ మొసలి తీవ్రంగా గాయపర్చింది. దీంతో ఆమె మరణించారు. అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో 1970ల్లో ఆస్ట్రేలియాలో మొసళ్లను రక్షిత జీవులుగా ప్రకటించారు. అప్పటినుంచి వీటి సంఖ్య భారీగా పెరిగింది.
ఆస్ట్రేలియాలో ఏటా 250కి పైగా ఉప్పు నీటి మొసళ్లు కనీసం ఇద్దరు వ్యక్తులనైనా చంపుతున్నాయి. దీంతో వీటి సంతతిని అరికట్టడానికి అక్కడి వైల్డ్ లైఫ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మకంగా మారిన మొసళ్లను పట్టుకుని క్రోకోడైల్స్ ఫార్మ్‌లో ఉంచుతున్నారు. తాజాగా పట్టుబడ్డ రాకాసి మొసలిని కూడా అక్కడికే తరలించారు.