వాయుసేనకు కొత్త ‘తేజస్సు’!
సాక్షి, బెంగళూరు: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) ‘తేజస్’ వాయుసేన అమ్ములపొదికి చేరేందుకు మరింత చేరువైంది. వాయుసేనలో ప్రవేశంకోసం తేజస్‌కు ఈ మేరకు ప్రాథమిక నిర్వహణ అనుమతి(ఐవోసీ-2) లభించింది. బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తేజస్‌ను వాయుసేనకు అప్పగించేందుకుగాను ‘రిలీజ్ టు సర్వీస్’ ధ్రువపత్రాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్‌ఏకే బ్రౌనేకు రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అందజేశారు.
అనంతరం ఆంటోనీ మాట్లాడుతూ.. తేజస్ అత్యంత యుద్ధపాటవంగల అస్త్రంగా రూపొందిందన్నారు. ఇటీవలే సర్వీసు నుంచి వైదొలగిన మిగ్-21 ఎఫ్‌ఎల్ యుద్ధవిమానం స్థానాన్ని తేజస్ భర్తీ చేయనుందని, తేజస్‌ను మూడేళ్లుగా పరీక్షించి, దాని సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చారన్నారు. సామర్థ్యానికి గుర్తింపుగానే వాయుసేనలో ప్రవేశం కోసం ఐఓసీ-2 లభించిందన్నారు. 2006లో తాను రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పుడు స్వదేశీ ఎల్‌సీఏ భవిష్యత్తుపై అనుమానాలుండేవని, అవన్నీ ఈ రోజు పటాపంచలు అయ్యాయన్నారు. జైసల్మేర్‌లో జరిపిన ఐరన్ ఫిస్ట్ (ఉక్కు పిడికిలి) పరీక్ష, ఇటీవల గోవాలో నిర్వహించిన క్షిపణి ప్రయోగాలూ తేజస్ సామర్థ్యాన్ని చాటాయన్నారు. కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్‌ఏకే బ్రౌనే మాట్లాడుతూ.. ఐఓసీ రావడం తేజస్ సామర్థ్యానికి ‘ఖరారు పత్రం’లాంటిదన్నారు.
తేజస్ ఒక్క ఈ ఏడాదిలోనే 500 సార్లు ఎగిరిందని, 2001 నుంచి మొత్తం 2,400 పరీక్షల్లో 3 వేల గంటలపాటు ఎగిరినా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రాజెక్టు: స్వదేశీ తేలికపాటి యుద్ధవిమానాల తయారీ కోసం రక్షణ శాఖ 1983లోనే రూ. 560 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే అనేక అవాంతరాలు, అనుమానాల మధ్య ఈ ప్రాజెక్టు మూడుదశాబ్దాలుగా సాగుతూ ఎట్టకేలకు తుదిదశకు చేరింది. తద్వారా స్వదేశీయంగాఎల్‌సీఏలను తయారుచేయగలిగిన అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.25 వేల కోట్లు అవుతుందని అంచనా. ఇప్పటికే అనేక పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత 2014 చివరినాటికి తేజస్ కు తుది నిర్వహణ అనుమతి (ఎఫ్‌వోసీ) లభిస్తుంది. ఆ తర్వాత ఇది వాయుసేనలో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఐవోసీ కోసం 20 విమానాలను, ఎఫ్‌వోసీ కోసం మరో 20 విమానాలను హెచ్‌ఏఎల్ ఉత్పత్తి చేయనుంది.