Light Combat Aircraft
-
వాయుసేనలోకి ‘తేలికపాటి’ తేజస్
కోయంబత్తూరు: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) తన తొలి లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్సీఏ) తేజస్ ఎంకే–1ను బుధవారం స్క్వాడ్రన్ నం.18 ఫ్లయింగ్ బుల్లెట్స్‌లోకి ప్రవేశపెట్టింది. తమిళనాడులోని కోయంబత్తూరు శివార్లలో సూలూరులో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హెచ్ఏఎల్) రూపొందించింది. ఈ సందర్భంగా హెచ్ఏఎల్ చైర్మన్, ఎండీ ఆర్.మాధవన్ సంబంధిత పత్రాలను ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియాకు అందజేశారు. తేజస్ ఎంకే–1 నాలుగోతరం సూపర్‌సానిక్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో అతి తేలికైన, చిన్నదైన యుద్ధ విమానం. ప్రత్యేకతలు.. ► ఒక ఇంజిన్, డెల్టా వింగ్‌తో కూడిన నాలుగో తరం యుద్ధ విమానం. ► హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని డిజైన్ చేసింది. ► ధ్వని కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ► బరువు 6,560 కిలోలు ► 15 కిలోమీటర్ల ఎత్తులోనూ పనిచేయగలదు. ► పొడవు 13.2 మీటర్లు... పరిధి ► 1,850 కిలోమీటర్లు తేజస్ చరిత్ర ► 1983: మిగ్–21 విమానాల స్థానంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తేలికపాటి యుద్ధ విమానాన్ని సిద్ధం చేసే ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ► 1986: తేలికపాటి యుద్ధ విమానం లేదా ఎల్సీఏ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.575 కోట్లు కేటాయించింది. ► 2001: ఎల్సీఏ తొలి ప్రయోగాత్మక పరీక్ష ► 2003: ఎల్సీఏకు ‘తేజస్’ అని నామకరణం చేసిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ► 2016: భారతీయ వాయుసేనలోని 48వ స్క్వాడ్రన్‌లో తొలిసారి తేజస్ నియామకం. బహ్రెయిన్‌లో తొలిసారి అంతర్జాతీయ వేదికపై తేజస్ ప్రదర్శన ► 2017: 68వ గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారి తేజస్ ప్రదర్శన ► 2018: వాయుసేన నిర్వహించిన గగన్ శక్తి కార్యక్రమంలో సత్తా చూపిన తేజస్ ► 2020: వాయుసేన 18వ స్క్వాడ్రన్‌లోకి తేజస్. -
భారత వైమానికదళంలోకి 'తేజస్'
బెంగళూరు: భారత వైమానిక దళం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. తేలికపాటి యుద్ధ విమానం 'తేజస్'ను బెంగళూరులో శుక్రవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఆధ్వర్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'తేజస్' చేరికతో భారత వైమానిక దళం అగ్రశ్రేణి దేశాల సరసన చేరినట్లు చెప్పొచ్చు. భారత వైమానిక దళంలో దీనిని చేర్చడానికి 33 ఏళ్ల సుదీర్ఘకాలం పట్టడం పూడ్చలేని లోటు అయినప్పటికీ.. తేజస్ చేరిక వైమానిక దళానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఇవాళ జరిగిన కార్యక్రమంలో రెండు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్‌లను భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. మొట్టమొదటి తేజస్ స్క్వాడ్రన్‌ను 'ఫ్లయింగ్ డ్యాగర్స్' గా పిలుస్తున్నారు. ఈ స్క్వాడ్రన్‌లోకి మరో ఆరు తేజస్‌లు త్వరలోనే చేరనున్నాయి. -
వాయుసేనకు కొత్త ‘తేజస్సు’!
సాక్షి, బెంగళూరు: భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) ‘తేజస్’ వాయుసేన అమ్ములపొదికి చేరేందుకు మరింత చేరువైంది. వాయుసేనలో ప్రవేశంకోసం తేజస్‌కు ఈ మేరకు ప్రాథమిక నిర్వహణ అనుమతి(ఐవోసీ-2) లభించింది. బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తేజస్‌ను వాయుసేనకు అప్పగించేందుకుగాను ‘రిలీజ్ టు సర్వీస్’ ధ్రువపత్రాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌనేకు రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అందజేశారు. అనంతరం ఆంటోనీ మాట్లాడుతూ.. తేజస్ అత్యంత యుద్ధపాటవంగల అస్త్రంగా రూపొందిందన్నారు. ఇటీవలే సర్వీసు నుంచి వైదొలగిన మిగ్-21 ఎఫ్ఎల్ యుద్ధవిమానం స్థానాన్ని తేజస్ భర్తీ చేయనుందని, తేజస్‌ను మూడేళ్లుగా పరీక్షించి, దాని సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపర్చారన్నారు. సామర్థ్యానికి గుర్తింపుగానే వాయుసేనలో ప్రవేశం కోసం ఐఓసీ-2 లభించిందన్నారు. 2006లో తాను రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పుడు స్వదేశీ ఎల్సీఏ భవిష్యత్తుపై అనుమానాలుండేవని, అవన్నీ ఈ రోజు పటాపంచలు అయ్యాయన్నారు. జైసల్మేర్‌లో జరిపిన ఐరన్ ఫిస్ట్ (ఉక్కు పిడికిలి) పరీక్ష, ఇటీవల గోవాలో నిర్వహించిన క్షిపణి ప్రయోగాలూ తేజస్ సామర్థ్యాన్ని చాటాయన్నారు. కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌనే మాట్లాడుతూ.. ఐఓసీ రావడం తేజస్ సామర్థ్యానికి ‘ఖరారు పత్రం’లాంటిదన్నారు. తేజస్ ఒక్క ఈ ఏడాదిలోనే 500 సార్లు ఎగిరిందని, 2001 నుంచి మొత్తం 2,400 పరీక్షల్లో 3 వేల గంటలపాటు ఎగిరినా ఎలాంటి అవాంతరాలు ఎదురుకాలేదన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రాజెక్టు: స్వదేశీ తేలికపాటి యుద్ధవిమానాల తయారీ కోసం రక్షణ శాఖ 1983లోనే రూ. 560 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే అనేక అవాంతరాలు, అనుమానాల మధ్య ఈ ప్రాజెక్టు మూడుదశాబ్దాలుగా సాగుతూ ఎట్టకేలకు తుదిదశకు చేరింది. తద్వారా స్వదేశీయంగాఎల్సీఏలను తయారుచేయగలిగిన అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.25 వేల కోట్లు అవుతుందని అంచనా. ఇప్పటికే అనేక పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత 2014 చివరినాటికి తేజస్ కు తుది నిర్వహణ అనుమతి (ఎఫ్‌వోసీ) లభిస్తుంది. ఆ తర్వాత ఇది వాయుసేనలో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఐవోసీ కోసం 20 విమానాలను, ఎఫ్‌వోసీ కోసం మరో 20 విమానాలను హెచ్ఏఎల్ ఉత్పత్తి చేయనుంది.