టీ-బిల్లు తేవడంతో జాప్యం!: కోదండరాం
రెండు నెలలు గడుస్తున్నా కేబినెట్ భేటీ కాలేదు: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడంలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని టీ-జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణపై నోట్ తయారుచేసి రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ కేబినెట్ భేటీ కాలేదన్నారు. టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరిగిన దీక్షాదివస్‌లో, తెలంగాణ విద్యావంతుల వేదిక గ్రేటర్ కమిటీ హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన సంపూర్ణ తెలంగాణ సాధనా సదస్సు లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ 2009లో చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని తట్టిలేపిందన్నారు. అన్నివర్గాల మద్దతు, ప్రజల పోరాటంతో తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం కదిలిందన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యాంగ బద్ధంగా నడవకపోతే బేడీలు వేసి జైలుకు పంపాల్సిందేనని హెచ్చరించారు రాజ్యాంగంపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కిరణ్ రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేకుండా తుపాకీ రామునిలాగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
రాష్ట్రసాధనలో చూపిన ఐక్యతనే విభజన అనంతరం జరిగే పునర్‌నిర్మాణంలోనూ కొనసాగించాలని కోరారు. ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో నిషేధానికి గురైన తెలంగాణపదం నిత్యం పతాక శీర్షికల్లోకి ఎక్కేందుకు కేసీఆర్ కృషే కారణమని చెప్పారు. ‘టీఆర్‌ఎస్‌ను ఏ పార్టీలోనూ కలపొద్దు’ అని 99శాతం మంది తెలంగాణ ప్రజలు తమను కోరుతున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరుల త్యాగాన్ని టీఆర్‌ఎస్ గౌరవిస్తుందని రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, కుటుంబానికి 5-10లక్షల పరిహారం అందించేందుకు కృషిచేస్తామన్నారు. టీఆర్‌ఎస్ అగ్రనేత కే. కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం సాగినంత సుదీర్ఘ ప్రక్రియ మరే రాష్ర్టం ఏర్పాటులోనూ జరగలేదన్నారు. సంపూర్ణ తెలంగాణ ఏర్పాటుకాకుంటే మలిదశ పోరాటానికి సిద్ధంకావాలని జేఏసీ నేత విఠల్ సూచించారు. మరోనేత శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగిస్తూ హైదరాబాద్, మునగాల, భద్రాచలం వంటి ప్రాంతాలపై ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు.
దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణపై అన్నివర్గాల అభిప్రాయం తీసుకున్న తర్వాత కేంద్రం ముందుకు వెళుతున్నప్పటికీ కొన్నిపార్టీలు వైఖరి మార్చుకున్నాయని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ స్వామిగౌడ్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్, నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడారు. టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ టీవీవీ అధ్యక్షుడు శ్రీధర్ దేశ్‌పాండే రాసిన బట్వారా (వ్యాసాల సంకలనం)ను కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య ఆవిష్కరించారు. పదిజిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణను ఏర్పాటుచేయాలంటూ సదస్సులో తీర్మానించారు.