సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ మంత్రులు అల్టిమేటం ఇచ్చారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను వెంటనే చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించలేని నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు సమావేశమై రెండు గంటలపాటు చర్చిం చారు. డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, పి.సుదర్శన్‌రెడ్డి, జి.ప్రసాద్‌కుమార్‌తోపాటు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి పి.బలరాం నాయక్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ హాజరయ్యారు.
సీఎం వైఖరిపై ఆగ్రహం: సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరును మంత్రులంతా తప్పుబట్టారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయడంవల్ల ప్రజలంతా తీవ్ర ఇక్కట్లు పడుతున్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. గతంలో కేబినెట్ సమావేశమైనప్పుడు నెలాఖరులోగా ఈ పరిస్థితులను చక్కదిద్దుతానని, ఆ తరువాత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని హామీ ఇచ్చినా ఇంతవరకు పట్టించుకోకపోవడంపట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ప్రజల్లోకి కాంగ్రెస్‌ను తీసుకెళ్లేందుకు వ్యూహరచన: కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏం చేయాలనే అంశంపై చర్చించారు. డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా జైత్ర యాత్రలు నిర్వహించి ఇచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్న అంశాన్ని ప్రజలకు చాటి చెప్పడంతోపాటు కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలపాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 18న తొలుత నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ఈ నెల 21న ఖమ్మం, 24న కరీంనగర్, 29న మహబూబ్‌నగర్, నవంబర్ 6న వరంగల్, 10న రంగారెడ్డి, 15న ఆదిలాబాద్, 21న మెదక్, 25న నల్గొండ జిల్లాల్లో జైత్ర యాత్ర పేరుతో సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఆయా సభల అనంతరం ఆఖర్లో హైదరాబాద్‌లో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ తేదీని త్వరలో వెల్లడిస్తామని జానారెడ్డి మీడియాకు చెప్పారు. ఏపీఎన్జీవోలు అపోహలు, అనుమానాలతో ఆందోళన చేయడం బాధాకరమని జానా అన్నారు. తెలంగాణ విడిపోవడానికి చారిత్రక కారణాలున్నాయనే వాస్తవాన్ని గమనించి సహకరించాలన్నారు. అవాంఛనీయ శక్తులు ఉద్యమంలో చేరితే హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదముందన్నారు. కొన్ని జిల్లాల్లో ఈ తరహా ఘటనలను చూస్తున్నామని, ఎవరినో లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ బొత్స ఆస్తులను ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న పరిణామాలపట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఆలోచించాలని కోరారు. అందులో భాగంగా తక్షణమే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితులను చక్కదిద్దేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చేతకాదంటే చెప్పండి: తెలంగాణ మంత్రులు
Published Tue, Oct 8 2013 3:34 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement